
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జాబితా సిద్ధం చేయండి
గద్వాల: ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాల కింద అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను వెంటనే జిల్లాస్థాయికి పంపాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌యువ వికాసం పథకాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, అర్హుల వివరాల జాబితాను వెంటనే అందజేయాలన్నారు. పైలట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి, పురోగతిని పర్యవేక్షించాలన్నారు. ఈఈలు పంచాయతీ కార్యదర్శులతో కలిసి లబ్ధిదారుల నిర్మాణం పనులను ప్రారంభించుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిగ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా రాజీవ్‌యువ వికాసం పథకం కింద లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని, అర్హుల ఎంపికను పారదర్శకంగా పూర్తి చేయాలని లబ్ధిదారుల వివరాల సాఫ్ట్ కాపీని బ్యాంకులకు వెంటనే పంపించాలన్నారు. సెక్టార్ వారీగా నాన్‌లింకేజి బ్యాంకింగ్ వివరాలతో జాబితాను సిద్ధం చేయాలన్నారు. సోమవారంలోపు లబ్ధిదారుల బ్యాంకు వివరాలు నిర్ధారణను పూర్తి చేతి తుది జాబితాను సమర్పించాలన్నారు. అధికారులు, బ్యాంకర్లు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకునే విధంగా కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్‌బాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి పాక్షిక శనిత్రయోదశి సందర్భంగా శనివారం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తిలతైలాభిషేకాలతో పూజలు చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల చేత శనిదోష నివారణ కోసం గోత్రనామార్చన, అభిషేకాలు, అర్చనలు వంటి పూజలను అర్చకులు చేయించారు. భక్తులు శనేశ్వరుడి పూజల అనంతరం శివాలయంలో బ్రహ్మసూత్ర శివుడికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జాబితా సిద్ధం చేయండి