దారి తప్పుతున్నారు..! | - | Sakshi
Sakshi News home page

దారి తప్పుతున్నారు..!

May 9 2025 1:26 AM | Updated on May 9 2025 1:32 AM

మద్యానికి బానిసలవుతున్న మైనర్లు, యువత

తల్లిదండ్రులు అప్రమత్తంగా

ఉండాలి

పిల్లలు మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే మొదట్లోనే తల్లిదండ్రులు గుర్తించి మందలించాలి. వారికి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వొద్దు. డబ్బు విలువ తెలిసేలా.. పిల్లల ఫీజుల కోసం తాము పడుతున్న కష్టాన్ని వివరించాలి. చెడు వ్యసనాల బారిన పడడం వల్ల కలిగే అనర్థాలను వివరించి సన్మార్గంలో నడిచేలా చూడాలి. చిన్న తనంలోనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించి.. దానిని చేరుకునేందుకు కష్టపడి చదవాలని నిత్యం దిశానిర్దేశం చేయాలి. డ్రంకెన్‌ డ్రైవ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ తదితర కేసుల్లో మైనర్లు పట్టుబడితే.. వారితోపాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాం.

– మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల

గద్వాల క్రైం: నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్తుండేవారు. కానీ, ఇప్పుడు చదువు మరిచి కొందరు మైనర్లు చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. వీరిలో అధికంగా 16 ఏళ్లు నిండని మైనర్లు.. యువతే ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. సరదాగా అలవాటు చేసుకున్న మద్యం, దూమపానానికి బానిసలుగా మారి.. ఆ మత్తులోనే వాహనాలు తీసుకొని రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. మరికొందరు మత్తు పదార్థాలు కొనుగోలు చేసేందుకు ఏకంగా వాహనాల దొంగతనాలకు వెనకాడడంలేదు. గద్వాల – అలంపూర్‌ సెగ్మెంట్‌లలో ఇటీవల ప్రమాదాల బారినపడి గాయాలైన ఘటనలు అనేకం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి మీద కన్నవారికి ఆశలు, ఆశయాలు ఉంటాయి. కానీ, వారు మాత్రం చెడు వ్యసనాలకు అలవాటు పడి.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడి.. పలు కేసుల్లో ఇరుక్కొని భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా చేసుకుంటున్నారు.

డబ్బు కోసం అడ్డదారులు..

సిగరేట్‌, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ మైనర్లు, యువత.. అదే ఫ్యాషన్‌ అనే భ్రమలో కాలం గడుపుతున్నారు. నిషాలో జోగుతూ భవిష్యత్‌ చిత్తు చేసుకుంటున్నారు. మత్తులో డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇళ్లలో చొరబడి విలువైన వస్తువులు, సామగ్రి దొంగలిస్తున్నారు. వాటిని తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించి వచ్చిన నగదుతో మద్యం, ఇతర మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సైతం పట్టణ శివారు ప్రాంతాలకు స్నేహితులతో కలిసి వేడుకల పేరుతో హంగామా సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. అటుగా వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద చిన్నారులకు మద్యం విక్రయించబోమనే నిబంధన ఉన్నా.. అది అమలు కావడంలేదనే విమర్శలు వినవస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్‌ చేసే సమయంలో పలువురు మైనర్లు దొరికిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం పోలీసులకు పరిపాటిగా మారింది.

80 ఈ – పెట్టి.. 40 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

మితిమీరిన వేగంతో రోడ్డు

ప్రమాదాలకు కేంద్ర బిందువుగా

నిలుస్తున్న ఘటనలు అనేకం

ఈజీ మనీ లక్ష్యంగా దొంగతనాలు

పోలీసుల తనిఖీల్లో

పట్టుబడుతున్న వైనం

అడ్డుకట్ట వేయడంలో

కుటుంబ సభ్యులు విఫలం

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బైక్‌లు, కార్లు నేర్పిస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం తప్పు అని తెలిసినా.. ఇంట్లో ఏదైన పని ఉంటే ఆసరా అవుతారనే భావనతో పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు ఏమో వారాంతాలు, వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి బైక్‌ల మీద అతివేగంగా దూసుకెళ్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన లేని వయస్సులో వాహనాలు నడుపుతూ ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొట్టడమో, ఓవర్‌ టేక్‌ చేసే సమయంలో ప్రమాదాల బారిన పడడమో, అతివేగంతో అదుపుతప్పిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వీరిని మొదట్లోనే నిలువరించాల్సిన తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇటీవల చేపట్టిన తనిఖీల్లో మైనర్లు బైక్‌ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ 30 వరకు 80కి పైగా ఈ పెట్టి కేసులు, 40 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలని, వారు అడిగినన్ని డబ్బులు ఇవ్వకుండా స్వయంగా వారి అవసరాలను గుర్తించి వారే డబ్బులు చెల్లించాలని, వాహనాలు నడుపుతున్నారని మురిసిపోవడం కంటే వారు చేస్తున్నది తప్పు అన్న విషయాన్ని గుర్తించాలని, పిల్లల అలవాట్లు, పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం, రోజువారి కార్యకలాపాలపై దృష్టి సారించాలని, ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే మందలించాలని పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

దారి తప్పుతున్నారు..! 1
1/3

దారి తప్పుతున్నారు..!

దారి తప్పుతున్నారు..! 2
2/3

దారి తప్పుతున్నారు..!

దారి తప్పుతున్నారు..! 3
3/3

దారి తప్పుతున్నారు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement