
కలంపై జులుం సహించం
గద్వాల: ప్రజాస్వామ్యంలో పత్రిక, మీడియా రంగం నాలుగో స్తంభమని.. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రంగానికి భంగం వాటిల్లే చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని.. కలంపై జులుం ప్రదర్శించాలని చూస్తే సహించేది లేదని సీనియర్ జర్నలిస్టులు హెచ్చరించారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ పాలనలోని లోపాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పుటికప్పుడు ‘సాక్షి’ దినపత్రిక ఎండగడుతూ వస్తోంది. దీనిని జీర్ణించుకోలేని ఏపీ పాలకులు పోలీసులతో అప్రజాస్వామ్యంగా ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో గురువారం తనిఖీల పేరిట దౌర్జన్యానికి తెగబడటాన్ని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద గద్వాల వర్కింగ్ జర్నలిస్టులు ఏపీ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు. పోలీసులతో పత్రిక గొంతును నొక్కేప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. పాలకులు ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సిన అవసరముందని, అదేవిధంగా పోలీసుల చర్యలు చట్టాన్ని పరిరక్షించి శాంతిభద్రతలను కాపాడాలే ఉండాలి తప్పితే రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించరాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అప్రజాస్వామ్య చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో జర్నలిస్టుల నుంచి ప్రజాస్వామ్యబద్దంగా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ జర్నలిస్టులు, వెంకటేష్, హరికృష్ణ, గోకారి,మధు, లోకేష్, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన