మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి, వాటిని ఖరారు చేసే వరకు గ్రూప్–1, 2, 3 ఫలితాలను ప్రకటించవద్దని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీయూ మెయిన్ గేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది స్వార్థపరుల ఒత్తిడి మేరకు మాదిగ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీయాలన్న కుట్రతో ముందస్తుగా గ్రూప్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో ఏబీసీడీ వర్గీకరణ అనంతరం మాత్రమే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని ప్రభుత్వం చెబుతూనే ఫలితాల విడుదలకు కసరత్తు చేయడం బాధాకరమని, రిజర్వేషన్‌ల బిల్లు పెట్టి వర్గీకరణ చేసే వరకు నిరసన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ అధ్యక్షుడు టైగర్ అంజయ్య, వీరస్వామి, జేఏసీ చైర్మన్ రాము, దాసు, శ్రీను, రవితేజ, రాము, నాగేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.