గద్వాలటౌన్: ప్రతి క్రీడాకారుడికి క్రీడా స్ఫూర్తి ముఖ్యమని, దీని వల్లే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని డీవైఎస్‌ఓ జితేందర్ పేర్కొన్నారు. ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు, కిట్లు అందజేయాడానికి దాతలు ముందుకు వచ్చారు. ఆదివారం వాటిని డీవైఎస్‌ఓ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సుమారు 50 మంది కబడ్డీ క్రీడాకారులకు క్రీడా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన క్రీడాకారులను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడు జాతీయస్థాయి పోటీలను లక్ష్యంగా నిర్దేశించుకొని ఆడాలని సూచించారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్పూర్తి ప్రదర్శించాలని సూచించారు. కబడ్డీ క్రీడా వల్ల శారీరక దృఢత్వంతోపాటు, మానసిక దృఢత్వం లభిస్తుందని చెప్పారు. గెలుపోటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమన్నారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయన్నారు. గెలుపు ఓటములను ప్రతి క్రీడాకారుడు సమానంగా స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో కోచ్ తిరుపతి, ఫిజికల్ డైరెక్టర్ రజినికాంత్, విజయ్‌కుమార్, బాస్కర్ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు సర్వేశ్వర్‌రెడ్డి, మోహన్‌బాబు, సురేష్, కొత్త గణేష్ తదితరులు పాల్గొన్నారు.