ఎర్రవల్లి: సమాజంలో అవమానాలు, అత్యాచారం, అభద్రతాభావం ఉన్న ప్రస్తుత కాలంలో మహిళల పట్ల ఆలోచన ధోరణి మారాలని పదో బెటాలియన్ కమాండెంట్ ఎన్.వి సాంబయ్య అన్నారు. శనివారం మండంలోని బీచుపల్లి పదో బెటాలియన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించగా.. కమాండెంట్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలతో కలిసి జ్యోతి ప్రజ్వలన, కేక్ కటింగ్ చేశారు. అనంతరం బెటాలియన్‌లోని మహిళలను శాలువాలతో సత్కరించి మాట్లాడారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన సీ్త్ర సమానత్వమే మన ప్రగతికి మూలమన్నారు. చాలామంది మహిళా మూర్తులు స్వశక్తితో ఉన్నత స్థితికి చేరుకొని సీ్త్రశక్తి అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేస్తున్నారన్నారు. అంతరిక్ష యానంలో సేవలందిస్తున్న సునీతా విలియమ్స్, దేశ రాష్ట్రపతి ద్రౌపతిముర్ముతోపాటు కిరణ్‌బేడి, పీ.వీ సింధు వంటి వారు ఎన్నో రంగాల్లో ముందున్నారన్నారు. అనంతరం మహిళలకు వివిధ క్రీడలను నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారిని కమాండెంట్ అభినందించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్‌లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు, పాణి, ఆర్‌ఐలు రాజేష్, రాజారావు, వెంకటేశ్వర్లు, శ్రీదర్, అదికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.