మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రస్తుతం బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో మొత్తం రూ.3,225 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1, అల్టమిన్, లోహం మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని తెలుగులో ‘నమస్తే.. బాగున్నారా..!’ అని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘పుష్ప తగ్గేలే..’ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ ‘దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. ఇక నిరంతర అభివృద్ధే..’ అని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి అమరరాజా కంపెనీలో 80 శాతం మహిళలే పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. కాగా మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో పాటు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి
అశ్వినివైష్ణవ్