చేతివృత్తుల వారికి ఆర్థిక తోడ్పాటు | - | Sakshi
Sakshi News home page

చేతివృత్తుల వారికి ఆర్థిక తోడ్పాటు

Mar 7 2025 12:41 AM | Updated on Mar 7 2025 12:40 AM

గద్వాల: సాంప్రదాయ చేతివృత్తుల వారికి ఆర్థికంగా మరింత స్థిరపడేందుకు రూపొందించిన పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో పీఎం విశ్వకర్మ పథకంపై ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న చేతికులవృత్తుల వారికి చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కులవృత్తులపై ఆధారపడి జీవించే వారిలో సామర్థ్యాన్ని పెంచి నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉత్పాదకత, నాణ్యత, ఉత్పత్తులను మెరుగుపర్చి ఆర్థికంగా చేయూతనిస్తూ జీవనోపాధిని అభివృద్ధి చేయడమే ఈపథకం లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, మంగలి, ఉప్పరి, ఎరుకలి, దర్జీ తదితర 18 కులవృత్తుల వారికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శిక్షణతో పాటు రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈపథకంలో చేరడం ద్వారా విశ్వకర్మ సర్టిఫికెట్‌, ఐడీ కార్డుతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ టూల్‌కి ట్లు, రుణసదుపాయం, డిజిటల్‌ లావాదేవీల ప్రోత్సాహం మార్కెటింగ్‌కు మద్దతు లభిస్తుందని తెలిపారు.

ఉచిత శిక్షణ.. రుణాలు

18 సంవత్సరాలు పైబడిన కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులని ఎలాంటి విద్యార్హత లేకున్నా పేరు నమోదు చేసుకోవచ్చని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదన్నారు. విశ్వకర్మగా పేరు నమోదు ద్వారా ఆన్‌ౖలైన్‌లో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుబుక్‌, మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకోవాలని అనంతరం దరఖాస్తులను గ్రామ పంచాయతీ స్క్రీనింగ్‌ చేసి జిల్లా స్థాయి అమలు కమిటీకి పంపుతుందని తెలిపారు. ఎంపికై న వారికి రెండు రకాలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ప్రాథమిక నైపుణ్యం ద్వారా ఐదు నుంచి ఏడు రోజులు, అధునాతన నైపుణ్యానికి 15 రోజులు శిక్షణ అందిస్తూ శిక్షణ కాలంలో ప్రతిరోజు రూ.500 భృతి ఇవ్వడంతో పాటు శిక్షణ అనంతరం రూ.15వేల విలువైన టూల్‌ కిట్లు, ధ్రువీకరణ పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. రెండువిడతలుగా మొత్తం రూ.3లక్షల రుణం అందించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో రూ.లక్ష, రెండో విడతలో రూ.2 లక్షలు అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారికి రుణాలు మంజూరీ చేయడంలో బ్యాంకర్లు సహకరించాలన్నారు. ఈ రుణానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో పరిశ్రమల జిల్లా అధికారి రామలింగేశ్వర్‌గౌడ్‌, మైక్రో,స్మాల్‌, మీడియం ఎంటర్‌పైజెస్‌ ఏడీ శివరామ్‌ప్రసాద్‌, ఢిల్లీ ప్రతినిధి సంజీవ్‌కుమార్‌ సైని, ఇంచార్జీ డీపీవో నాగేంద్రం, ఎల్‌డీఎం అయ్యప్పురెడ్డి, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ రమేష్‌బాబు, చేనేత జౌళి ఏడీ గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement