వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి

Mar 6 2025 12:18 AM | Updated on Mar 6 2025 12:17 AM

అధికారులు సమర్థవంతంగా

విధులు నిర్వర్తించాలి

కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాలటౌన్‌: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. గద్వాల మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ఆయా శాఖల పనితీరుపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల విధులు, పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, వాహనాల స్థితి, పన్నుల వసూలు, ఆదాయ వనరులు, వ్యయాలు తదితర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి పూర్తి బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పట్టణంలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. సిబ్బంది హాజరుకు బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పార్కుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించి.. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం అవసరమైన ప్రాంతాల్లో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాలన్నారు.

ఆదాయ మార్గాలపై దృష్టి సారించండి..

మున్సిపల్‌ ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు దుబార వ్యయాన్ని తగ్గించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఆస్తిపన్ను వసూలు లక్ష్యం వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా దుకాణాల అద్దె బకాయిలపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. ఐడీఎస్‌ఎంటీ కాలనీలో మిగిలిన ప్లాట్లకు, లీజు గడువు ముగిసిన దుకాణాలకు వేలం నిర్వహించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్లాట్ల వేలంతో వచ్చే ఆదాయంతో కాలనీని అన్నివిధాలా అభివృద్ది చేయవచ్చని తెలిపారు.

కాంట్రాక్టు సిబ్బందికి బాధ్యతలు వద్దు..

మున్సిపాలిటీలో కాంట్రాక్టు సిబ్బందికి కీలక విభాగాలను అప్పగించవద్దని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. ప్రతి విభాగానికి రెగ్యులర్‌ అధికారి బాధ్యత వహించేలా విధులు కేటాయించాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి మున్సిపల్‌ పారిశుద్ధ్య వాహనాలు, యంత్రాలను పరిశీలించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ నర్సింగరావు, కమిషనర్‌ దశరథ్‌, ఇంజినీరు గోపాల్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement