గద్వాల అర్బన్: ఓపెన్ స్కూల్‌లో 2023–24 సంవత్సరానికి ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సిరాజుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాద రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
చెడు వ్యసనాలకు
దూరంగా ఉండాలి
గద్వాల క్రైం: చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి కవిత అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో నిలవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇప్పటి నుంచే క్రీడలు, సమాజంలో జరుగుతున్న అంశాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ధరూరులో
కేంద్ర బలగాల కవాతు
ధరూరు: ఎస్పీ రితిరాజ్ ఆదేశాల మేరకు జిల్లాకు వచ్చిన కేంద్ర బలగాలు సమస్యాత్మక గ్రామాల్లో కవాతు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే రెండో విడత మండల సబ్ ఇన్‌స్పెక్టర్ శివానందం గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ధరూరుతో పాటు ఉప్పేరులో వీధుల వెంట కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ శివానందం గౌడ్ మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇన్సిడెంట్ ప్రీగా ఎన్నికలు జరిగేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. జిల్లా పోలీస్ ఫోర్స్‌కు అదనంగా 100 మందితో కూడిన సీఆర్‌పీఎఫ్ వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమాలు తెలియజేశారు. ఈ నెల 30న జరగబోయే ఎన్నికలకు ఎలాంటి విఘాతం కలుగకుండా శాంతియుతంగా జరిగేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.
వేరుశనగ క్వింటా రూ.7,940
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు మంగళవారం 1,711 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టంగా రూ.7,940, కనిష్టంగా రూ.3,303, సరాసరి రూ.6,390 ధరలు పలికాయి. 148 క్వింటాళ్ల ఆముదం రాగా, గరిష్టంగా రూ.5,390, కనిష్టంగా రూ.3,909, సరాసరి రూ.5,299 ధరలు వచ్చాయి. 1059 క్వింటాళ్ల వరి(సోన) రాగా.. గరిష్టంగా రూ.2,410, కనిష్టంగా రూ.2,001, సరాసరి ధర రూ.2,319 ధరలు పలికాయి. 49 క్వింటాళ్ల వరి (హంస) రాగా, గరిష్టంగా.2,160, కనిష్టంగా రూ.2,060, సరాసరి రూ.2,160 ధరలు వచ్చాయి.