
అయిజ పెద్దవాగులో శిథిలావస్థకు చేరిన చెక్‌డ్యాం
● శిథిలమవుతున్న చెక్‌డ్యాంలు
● తెగిన సైడ్‌వాల్స్.. వృథాగా పారుతున్న నీరు
● అధికారుల పర్యవేక్షణ కరువు
అయిజ: అటు వ్యవసాయం అభివృద్ధి చెందాలని.. ఇటు భూగర్భజలాలు పెరగాలని.. వర్షపు నీరు వృథాగా పోవద్దనే లక్ష్యంతో నిర్మించిన చెక్‌డ్యాంలు ధ్వంసమై మరమ్మతుకు నోచుకోవడంలేదు. వాగులు, వంకల్లో నీరు నిల్వ ఉంచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చెక్‌డ్యాంలను నిర్మించింది. ఒక్కో చెక్‌డ్యాంకు రూ.5 లక్షలు ఖర్చుచేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోకి మొత్తం 20 చెక్ డ్యాంలు వచ్చాయి. ఇందులో ఏడు చెక్‌డ్యాంల సైడ్‌వాల్స్ తెగి నీరు నిల్వ ఉండేందుకు వీలులేక శిథిలమయ్యాయి. చెక్‌డ్యాంల సైడ్‌వాల్స్ కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు వాటిని పునర్ నిర్మించలేదు. కనీసం అవి మరమతు చేద్దామన్న ఊసు కూడా అధికారుల్లో కలగడంలేదు.
7 చెక్‌డ్యాంలు శిథిలం..
అయిజ శివారులో మొత్తం 4 చెక్‌డ్యాంలు ఉండగా వాటిలో రెండు శిథిలమయ్యాయి. అదేవిధంగా మానవపాడు మండలంలోని కలుకుంట్ల, మానవపాడు, కొరివిపాడు, జల్లాపూర్, పల్లెపాడు, చందూర్, చిన్న పోతులపాడు, గోకులపాడు, బొరవెల్లి, పెద్ద పోతులపాడు గ్రామ శివార్లలో మొత్తం 13 చెక్ డ్యాంలకుగాను 2 చెక్‌డ్యాంలు శిథిలమయ్యాయి. ఇటిక్యాల మండలంలోని ఉదండాపురం – సాతర్ల గ్రామాల మధ్య ఒకే చెక్‌డ్యాం ఉండగా అది కూడా శిథిలావస్థలో ఉంది. వడ్డేపల్లి మండలంలోని బుడమర్సులో రెండు చెక్‌డ్యాంలకు మరమ్మతు చేపట్టాల్సిన అవసరం ఉంది.
నాడు కలకల.. నేడు వెలవెల
గతంలో చెక్‌డ్యాంలు నిర్మించగా వర్షాకాలంలో సమృద్ధిగా నీరు నిలిచి చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగాయి. మూగజీవాల దాహం తీరింది. కానీ, 2009లో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. దీంతో చెక్‌డ్యాంల సైడ్‌వాల్స్ తెగిపోయాయి. కట్టడాలు శిథిలమయ్యాయి. రోజుల తరబడి మరమ్మతు చేపట్టకపోవడంతో అప్పటినుంచి ఇప్పటివరకు వాగుల్లో నీరు నిలవని పరిస్థితి. వాగులు ఎడారిని తలపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి చెక్‌డాంలన్నింటికి మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నూతనంగా మంజూరైన వాటిని త్వరగా పూర్తి చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
నత్తనడకన నూతన నిర్మాణాలు
జిల్లాలో మరో నాలుగు నూతన చెక్‌డ్యాంలు నిర్మాణ దశలో ఉన్నాయి. నందిన్నె శివారులో రూ.1.77 కోట్లు, గుంటిపల్లి శివారులో రూ.2.06 కోట్లు, దయ్యాలవాగు వద్ద రూ.1.96కోట్లు, చందూరు శివారులో రూ.1.2 కోట్ల నిధులతో నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం అవి నత్తనడకన సాగుతున్నాయి. అదేవిధంగా గువ్వల దిన్నె శివారులో నూతన చెక్‌డ్యాం నిర్మించేందుకు రూ.3.7కోట్లు, ఇర్కిచేడు శివారులో రూ.3.85 కోట్లు, ఉప్పల శివారులో రూ.2.82 కోట్ల నిధులతో నూతన చెక్‌డ్యాంలు నిర్మించేందుకు అనుమతులు లభించాయి. అయితే వాటికి ఇంకా టెండర్ వేయలేదు.
మండలం చెక్‌డ్యాంలు శిథిలమైనవి
అయిజ 4 2
మానవపాడు 13 2
ఇటిక్యాల 1 1
వడ్డేపల్లి 2 2
జిల్లా వివరాలిలా..
అధికారులు స్పందించాలి
చెక్‌డ్యాంలు తెగిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు మరమ్మతు చేయలేదు. సైడ్ వాల్స్ మరమ్మతు చేస్తే సరిపోతుంది. ఉన్నతాధికారులు స్పందించాలి. – మేకల నాగిరెడ్డి,
అయిజ మండల రైతుసంఘం అధ్యక్షుడు
బోర్లు వట్టిపోయాయి
చెక్‌డ్యాంలు తెగిపోయినప్పటి నుంచి వాగుల్లో నీరు నిల్వ లేకుండా పోయాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు పడిపోయి బోరుబావులన్నీ వట్టిపోయాయి. చెక్‌డ్యాంలను పునర్ నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. పంటలకు సాగునీటి ఇబ్బందులు తప్పుతాయి.
– దేవేందర్, సింధనూరు
ప్రతిపాదనలు పంపుతాం
తెగిపోయిన చెక్‌డ్యాంలకు మరమ్మతు చేపట్టలేదు. వీటికి సరిపడా నిధుల్లేవు. మరో నాలుగు చెక్‌డ్యాంలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో నాలుగింటికి అనుమతులు లభించాయి. త్వరలో టెండర్ ప్రక్రియ చేపడుతాం. తెగిపోయిన చెక్ డ్యాంల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతాం. – విజయ్‌కుమార్‌రెడ్డి, ఈఈ, ఆర్డీఎస్


