
గద్వాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని ఆధార్ సెంటర్ వద్ద కిక్కిరిసిన ప్రజలు
లబ్ధిదారులకు తలనొప్పిగా మారిన ఈకేవైసీ
16 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చా..
ఈకేవైసీ చేయించుకునేందుకు డీలర్‌షాపు వద్దకు వెళితే అక్కడ కంప్యూటర్లు పనిచేస్తలేవని గద్వాలకు వెళ్లమన్నారు. 16కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇచ్చాడికి వచ్చాను. ఇక్కడ కూడా కంప్యూటర్లు రావడం లేదంటున్నారు. అధికారులు స్పందించి పరిష్కారం చూపాలి. – అనంతమ్మ,
మన్నాపురం, ధరూరు మండలం
రోజు వస్తున్నా.. వెళ్తున్నా
రేషన్‌కార్డుకు ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పడంతో గద్వాలకు వచ్చాను. రెండు రోజులుగా ఆధార్‌సెంటర్‌కు వచ్చిపోతున్నాను. ఇక్కడ కూడా సర్వ ర్లు సరిగ్గా పనిచేస్తలేవని చెబుతున్నారు. ఈరో జు కూడా నాసమస్య తీరుతుందో లేదో.... అధికారులు స్పందించి తొందరగా అయ్యేలా చూడాలి. – పద్మ,
అమరాయి, మల్దకల్ మండలం
మా పిల్లల కోసం..
రేషన్‌కార్డు ఈకేవైసీ చేయించుకునేందుకు మా ఊరిలో డీలర్‌షాపునకు వెళితే నా బిడ్డ, కొడుకుది ఆధార్ అప్‌డేట్ లేదన్నారు. గద్వాలకు పొమ్మని చెప్పడంతో ఇక్కడి వచ్చాం. ఉదయం 8గంటలకు వచ్చినా మధ్యాహ్నం అవుతున్నా ఇంకా లోపలికే పోలేదు.
– గోపాల్, అనంతపురం, గద్వాల మండలం
ఉదయం నుంచి
ఎదురుచూస్తున్నా..
నా కుమారుడు హరి వేలిముద్రలు ఆప్‌డేట్ లేకపోవడంతో మా ఊరి డీలర్ ఆధార్‌సెంటర్‌కు పొమ్మని చెప్పారు. దీంతో 30కిలోమీటర్ల ప్రయాణం చేసి గద్వాలకు వచ్చాను. ఉదయం వచ్చినా. మధ్యాహ్నం 3గంటలు అవుతున్నా ఇంకా మేము లోపలికి వెళ్లలేదు.
– రాముడు, గార్లపాడు, ధరూరు మండలం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం
రేషన్‌కార్డు లబ్ధిదారులందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. సాంకేతిక సమస్యలతో ఈకేవైసీ ఆలస్యమవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటాం.
– చీర్ల శ్రీనివాసులు, అడిషనల్ కలెక్టర్
గద్వాల రూరల్: నిరుపేద కుటుంబాలకు రేషన్‌కార్డు ఓ ఆధారం. అయితే ఇటీవల ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందుకోసం రేషన్‌కార్డు కలిగిన ప్రతికుటుంబం తప్పకుండా సంబంధిత చౌకధర దుకాణాలలో ఈకేవైసీ చేయించుకోవాలి. దీంతో రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు చౌకధర దుకాణాలకు పరుగులు పెట్టారు. అయితే అక్కడ సాంకేతిక సమస్య తలెత్తడం, చాలామంది వేలిముద్రలు అనుసంధానం కాకపోవడంతో డీలర్లు వారిని ఆధార్‌సెంటర్లకు వెళ్లాలంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో జనాలు ఆధార్‌సెంటర్ల వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5.47లక్షల రేషన్ లబ్ధిదారులంటే కేవలం 1.25లక్షల మంది మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారంటే పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది.
ఈకేవైసీ కోసం తిప్పలు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 16,241రేషన్ కార్డులుండగా ఇందులో 5,47,906మంది లబ్ధిదారులున్నారు. ప్రతినెలా కార్డులోని ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి పండుగల సమయంలో నూనె, పిండి, ఉప్పు తక్కువ ధరకు ఇస్తున్నారు. ఇప్పటి వరకు సజావుగా కొనసాగుతున్న ప్రజాపంపిణీలో ప్రభుత్వం విడుదల చేసిన ఈకేవైసీ మార్గదర్శకాలతో రేషన్‌కార్డు లబ్ధిదారులకు చిక్కులొచ్చిపడ్డాయి. చౌకధర దుకాణాల వద్దనే రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవచ్చని అధికారులు చెబుతుండగా క్షేతస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రేషన్‌కార్డులోని లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు చౌకధర దుకాణాల వద్దకు వెళితే చాలా మందికి వేలిముద్రలు అనుసంధానం కాకపోవడం, ఆధార్‌కార్డు అప్‌డేట్ లేకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో ఈకేవైసీ కోసం జనాలు ఆధార్‌సెంటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు.
చౌకధర దుకాణాల్లో పనిచేయని వేలిముద్రలు
ఆధార్ సెంటర్లలో మొరాయిస్తున్న సర్వర్లు
కేంద్రాల వద్ద జనం తాకిడి.. అదుపు చేసేందుకు పోలీసుల రంగ ప్రవేశం
జిల్లాలో 5.47లక్షల మందికి 1.25లక్షల మందికి ఈకేవైసీ పూర్తి
కిక్కిరిసిన ఆధార్ సెంటర్లు
ఇదిలా ఉంటే రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ, ఆధార్ అప్‌డేట్ చేయించుకునేందుకు ఆధార్‌సెంటర్లకు పరుగులు పెడుతుండడంతో ఆధార్ సెంటర్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఇటిక్యాల, గద్వాల, ధరూరు, మల్దకల్ మండలాలకు చెందిన లబ్ధిదారులు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఇలా ఒక్కసారిగా లబ్ధిదారుల తాకిడి ఎక్కువకావడంతో ఆధార్‌సెంటర్ల నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పైగా కొన్ని సందర్భాల్లో సర్వర్లు మొరాయిస్తుండడంతో జనాలకు సమాధానం చెప్పలేక, వారిని నియంత్రించలేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ఆధార్ సెంటర్‌లో ప్రజలను అదుపు చేస్తున్న పోలీసులు




