ఏరివేత షురూ.. | - | Sakshi
Sakshi News home page

ఏరివేత షురూ..

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

ఏరివేత షురూ..

2,070 రేషన్‌కార్డులు అనర్హమైనవిగా గుర్తింపు

భూపాలపల్లి: ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి, అనర్హులుగా ఉండి కూడా రేషన్‌కార్డులు పొందిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో చేపట్టిన రేషన్‌ కార్డుల ప్రక్షాళన ప్రక్రియ జిల్లాలో వేగవంతమైంది.

క్షేత్రస్థాయిలో విచారణ..

కొంతకాలంగా అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 2,070 మంది అనర్హులు తెల్లరేషన్‌కార్డులు పొందినట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులు, వాహనాలు, భూమి వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఐటీ చెల్లింపుదారులకు కార్డు తొలగింపు..

రేషన్‌కార్డుల ఏరివేత ప్రక్రియలో ముఖ్యంగా ఆదాయపు పన్ను (ఇన్‌కాంటాక్స్‌) చెల్లిస్తున్న వారిపై అధికారులు దృష్టి సారించారు. నిబంధనల ప్రకారం ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసే వ్యక్తులు తెల్లరేషన్‌ కార్డు పొందేందుకు అనర్హులు. అయినప్పటికీ పలువురు ఈ సమాచారాన్ని దాచిపెట్టి కార్డులు పొందినట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. అటువంటి వారి కార్డులను తక్షణమే రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అధికంగా భూపాలపల్లి పట్టణంలోనే..

జిల్లా కేంద్రం మినహా గ్రామీణ ప్రాంతాల్లో నూటికి 99 శాతం మంది తెల్లరేషన్‌కార్డు పొందేందుకు అర్హులే ఉన్నారు. భూపాలపల్లి పట్టణంలో మాత్రం వందల సంఖ్యలో అనర్హులు తెల్లరేషన్‌కార్డులు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఐటీ చెల్లించే వారితో పాటు, పలువురు ప్రభుత్వ, సింగరేణి ఉద్యోగులు సైతం తెల్లరేషన్‌కార్డు సొంతం చేసుకున్నట్లు సమాచారం. పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొని వచ్చి తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేయించినట్లు తెలుస్తోంది. జిల్లాకేంద్రంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపితే భారీ సంఖ్యలో అనర్హులు బట్టబయలు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

విచారణ చేపడుతున్న రెవెన్యూ అధికారులు

జిల్లాలో ఐటీ చెల్లించే వారి కార్డులు రద్దు..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement