భూపాలపల్లి అర్బన్: బ్యారెక్‌లలో నివాసముంటున్న కార్మికులకు రెండు బ్యారెక్‌లు కేటాయించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జీఎం కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాల సభ్యులు ధర్నా చేపట్టి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. సింగరేణిలో 1993 సంవత్సరం నుంచి కొనసాగుతున్న కాలనీలలో ప్రస్తుతం పెద్దసంఖ్యలో క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా కేటీకే 2 ఇంక్లైన్, 6 ఇంక్లైన్ ప్రాంతాలలో కలిపి సుమారు 520 క్వార్టర్లు ఉండగా, వాటిలో దాదాపు 320 క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కొన్ని క్వార్టర్లు శిథిలావస్థకు చేరి ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. ఖాళీ క్వార్టర్లను ఉపయోగించకుండా వదిలేయడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అద్దె ఇళ్లలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఖాళీ క్వార్టర్లను కార్మికులకు కేటాయించి, క్వార్టర్లను మరమ్మతు చేయాలని కోరారు. ప్రతీ రెండు బ్యారెక్‌లను ఒక క్వార్టర్‌గా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి శ్రీనివాస్, నారాయణ, శివ, బ్రహ్మం, కాలనీ మహిళలు స్వరూప, లక్ష్మి, సాహితి పాల్గొన్నారు.
చాక్‌పీస్‌పై ఏసు శిలువ
మల్హర్(కాటారం): గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని కాటారం గిరిజన గురుకుల కళాశాల చిత్రకళ ఉపాధ్యాయుడు, సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజినీకాంత్ చాక్‌పీస్‌స్‌తో ఏసు శిలువ తయారు చేశారు. ఏసుక్రీస్తు కళారూపాన్ని 3.5 సెంటీమీటర్ల ఎత్తు, 2.8 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి గుండు పిన్ సహాయంతో తయారుచేశారు.
రెమ్యునరేషన్ చెల్లించాలి
ములుగు: రాష్ట్రంలో 18 నెలల క్రితం నిర్వహించిన కులగణన కార్యక్రమంలో భాగంగా విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్‌ను చెల్లించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణన వంటి కీలక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. తమ వ్యక్తిగత సమయాన్ని, శ్రమను వెచ్చించి ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చిన వారికి రెమ్యునరేషన్ చెల్లింపులో నిర్లక్ష్యం ప్రదర్శించడం విచారకరమన్నారు.


