● ఎంఆర్‌ఐ ఏర్పాటులో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం
భూపాలపల్లి అర్బన్: ఎంఆర్‌ఐ యంత్రం అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం కలెక్టర్ సందర్శించారు. ఎంఆర్‌ఐ పరికరం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు. జిల్లా జనరల్ ఆస్పత్రి ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ సరఫరా పనుల్లో జాప్యం జరుగుతుండటంపై కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్‌ఐ యంత్రం కోసం అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనలో ఆలస్యం జరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించిన కలెక్టర్ అధి కారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరు కావడంపై షోకాజ్ నోటీస్ జారీచేయాలని ఆదేశించారు. ఎంఆర్‌ఐ పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్డీఓను నియమించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా ఏర్పాటుకు అవసరమైన పరికరాలు ఇప్పటికీ సమకూర్చకపోవడంపై ప్రశ్నిస్తూ, పనులు పూర్తికా వడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో అని అసహనం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేష్, టీజీఎంఎస్‌ఐడీసీ ఏఈ రవికిరణ్ పాల్గొన్నారు.


