● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా, పారదర్శకంగా కొనసాగాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. గురువారం భూపాలపల్లిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, పెట్రోల్, డీజిల్ సరఫరా విధానం, నిల్వల పరిస్థితి, అమ్మకాల విధానం, భద్రతా ప్రమాణాలను నిశితంగా పరిశీలించారు. పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, వినియోగదారులకు సమయానికి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ఆయిల్ కంపెనీలు ఇండెంట్ల ఆధారంగా నిరంతర సరఫరా కొనసాగిస్తున్నాయని తెలిపారు. వదంతుల నేపథ్యంలో అక్రమంగా నిల్వలు చేయడం, అక్రమంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేపడితే చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలో పౌర సరఫరాల అధికారి శరణ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


