అవగాహనతోనే ఆరోగ్య రక్షణ
● జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు
భూపాలపల్లి అర్బన్: ప్రతీఒక్కరు ఆరోగ్య రక్షణపై అవగాహన కలిగి ఉండాలని, కేన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ కేన్సర్ దినోత్సవాన్ని మున్సిపల్ పరిధిలో ని జంగేడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోజూ తగినంత నీరు సేవించడం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేస్తే అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చన్నారు. అనంతరం గైనకాలజిస్టులు ప్రత్యూష, లక్ష్మిలు మాట్లాడుతూ రొమ్ము కేన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌రావు, డాక్టర్ నిహారిక, పుప్పాల శ్రీనివాస్, అక్షయ, న్యాయవాది మంగళపల్లి రాజ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


