కడిగేసిన ‘కాగ్‌’! | - | Sakshi
Sakshi News home page

కడిగేసిన ‘కాగ్‌’!

Apr 3 2026 7:38 AM | Updated on Apr 3 2026 7:38 AM

వద్దంటే వజ్ర బస్సు.. రూ.కోట్లు హాంఫట్‌

జీడబ్ల్యూఎంసీలో దారిమళ్లిన ‘అమృత్‌’ నిధులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌లో అభివృద్ధి వేగం పెరుగుతుందని అధికారులు చెబుతుండగా.. అభివృద్ధి పేరిట జరిగిన నిబంధనల ఉల్లంఘనలను ‘కాగ్‌’ కడిగేసింది. కేటాయించిన నిధులు పూర్తిగా వినియోగం కాకపోవడం, ప్రాజెక్టులు ఆలస్యమవడం, శాఖల నిర్లక్ష్యం కలిసి అభివృద్ధిని నెమ్మదింపజేస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా గ్రేటర్‌ వరంగల్‌లో స్మార్ట్‌సిటీ పనులు, గ్రామాల్లో పంచాయతీరాజ్‌ పనులు, మహబూబాబాద్‌ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు.. ఈ మూడు రంగాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2022 మార్చితో ముగిసిన కాలానికి భారత కంప్ట్రోలర్‌, ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక –25ను ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విడుదల చేశారు. ఈ నివేదికలో ఉమ్మడి జిల్లాలో జరిగిన పలు పద్దులు, అంశాలు, ఉల్లంఘనలపై కాగ్‌ అక్షింతలు వేసింది.

గ్రేటర్‌లో దారిమళ్లిన నిధులు..

వరంగల్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో నీటి సరఫరా ప్రాజెక్టుల కోసం కేటాయించిన అమృత్‌ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు మళ్లించినట్లు కాగ్‌ గుర్తించింది. అమృత్‌ పథకంతో సంబంధం లేని రోడ్డు పనులు, టీ–ఫైబర్‌ ప్రాజెక్టు పనుల కోసం ‘మిషన్‌’ నిధుల నుంచి రూ.21.30 కోట్లు చెల్లించడాన్ని తప్పుబట్టింది. మున్సిపల్‌ సాధారణ నిధుల నుంచి చెల్లించాల్సిన సిమెంట్‌, ఇనుము ధరల సర్దుబాటు కోసం రూ.8.60 కోట్లు అమృత్‌ నిధులు వాడడం కూడా నిబంధనల ఉల్లంఘనేనంది. నీటి సరఫరా పనుల నిర్వహణలో కాంట్రాక్టర్‌కు అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు ఆడిట్‌లో తేలింది. పెట్రోల్‌, ఆయిల్‌, లూబ్రికెంట్స్‌ (పీఓఎల్‌) ధరల సర్దుబాటు లెక్కించేటప్పుడు, అసలు ధర లీటరుకు రూ. 64.36 ఉండగా, తప్పుగా రూ.62.46గా తీసుకోవడం వల్ల కాంట్రాక్టర్‌కు రూ.1.05 కోట్లు అదనంగా చెల్లించారని పేర్కొంది. బిల్లులను సిద్ధం చేసే సమయంలో ప్రభుత్వ ఉత్తర్వులు పాటించకపోవడం, పీఏఓల (పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌) పరిశీలన లోపం కారణంగా ఈ అధిక చెల్లింపులు జరిగాయని అభిప్రాయపడింది.

రిజర్వాయర్ల నిర్మాణంలో జాప్యం..

తాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి భూమిని అప్పగించడంలో విపరీతమైన జాప్యం జరిగిందని కాగ్‌ ఆక్షేపించింది. మొత్తం 33 ఎలివేటెడ్‌ లెవల్‌ సర్వీస్‌ రిజర్వాయర్‌ (ఈఎల్‌ఎస్‌ఆర్‌)ల నిర్మాణానికి సంబంధించి భూమి అప్పగింతలో 2 నుంచి 59 నెలల వరకు జాప్యం జరిగిందని పేర్కొంది. కోమటిపల్లి, కాకతీయ వైద్య కళాశాల, యాదవనగర్‌ వంటి ప్రాంతాల్లో భూ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా నిర్మాణ పనులు ఆలస్యమైనట్లు పాలకులు వివరణ ఇచ్చారు. యాదవనగర్‌ వద్ద 2022 ఏప్రిల్‌లో భూమి అప్పగించినా రిజర్వాయర్‌ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆడిట్‌ గమనించింది..

మోడికుంట్లవాగు ప్రాజెక్టులో నిర్లక్ష్యం..

ములుగు జిల్లాలోని మోడికుంట్లవాగు జలాశయ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని కాగ్‌ అధికారులపై అక్షింతలు వేసింది. పనులు ప్రారంభం కాకపోయినా కాంట్రాక్టర్‌కు ఇచ్చిన మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌పై జమ అయిన రూ.6.89 కోట్ల వడ్డీని వసూలు చేయడంలో ప్రభుత్వశాఖ విఫలమైందని స్పష్టం చేసింది.

రహదారుల నిర్వహణలో లోపాలు..

మహబూబాబాద్‌ జిల్లాలో గ్రామీణ రహదారుల నాణ్యతపై కాగ్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ బృందం ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించిందని, జిల్లాలోని పలు బీటీ రోడ్ల అంచులు విరిగిపోవడం, గుంతలు పడడం వంటి లోపాలను వారు గమనించారని పేర్కొంది. రోడ్ల ప్రారంభంలో ఉండాల్సిన పీఎంజీఎస్‌వై గుర్తింపు చిహ్నాలు, సైన్‌ బోర్డులు 95 శాతం పనుల్లో ఏర్పాటు చేయలేదని ఆక్షేపించింది.

దుస్థితిలో ఐటీ టవర్ల నిర్వహణ, పార్కులు..

వరంగల్‌లోని ఐటీ టవర్ల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి విధానాలు రూపొందించలేదంది. దీనివల్ల లీజు పత్రాల తయారీ, సిబ్బంది నియామకం, జరిమానాల విధింపు వంటి కీలక విషయాలపై టీఎస్‌ ఐఐసీకి స్పష్టత లేకుండా పోయిందని కాగ్‌ పేర్కొంది. కాగా, కోవిడ్‌–19, ఇతర కారణాల వల్ల వివిధ ఐటీ టవర్ల నుంచి సుమారు రూ. 3.42 కోట్ల బకాయిలను టీఎస్‌ఐఐసీ వసూలు చేయలేకపోయిందని, ఐటీ టవర్ల నిర్మాణం కోసం టీఎస్‌ఐఐసీ రూ. 134.40 కోట్లు ఖర్చు చేయగా, ప్రభుత్వం కేవలం రూ. 6.29 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చిందని కాగ్‌ కుండబద్ధలు కొట్టింది.

కల్యాణలక్ష్మిలో అవకతవకలు..

కల్యాణలక్ష్మి పథకం అమలులో అనేక లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఆడిట్‌లో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రధానంగా 5,522 కేసులను ఆడిట్‌ చేయగా.. వాటిలో రూ.55.12 కోట్ల విలువైన ప్రయోజనాలు అనర్హులకు అందినట్లు గుర్తించినట్లు స్పష్టమైంది. సిస్టంలో వరుడి ఆధార్‌ సంఖ్యను ఽధ్రువీకరించే నిబంధన లేకపోవడం.. ఒకే వరుడిని ఇద్దరు వధువులు వివాహం చేసుకున్నట్లు ఉన్న 676 కేసుల్లో రూ.3.38 కోట్లు మంజూరు చేశారు. ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా 80కి పైగా ఉన్నట్లు తేలిందని నివేదిక స్పష్టం చేసింది.

వరంగల్‌–హైదరాబాద్‌ రూట్‌లో వజ్ర బస్సులు లాభదాయకం కాదని, అప్పటికే ఉన్న బస్సుల కంటే ఇవి అదనపు భారమని ఆర్టీసీ ఆర్‌ఎం 2017లోనే చెప్పినా పెడ చెవిన పెట్టడం వల్ల రూ.22.04 కోట్లు వృథా అయ్యాయని కాగ్‌ అభిప్రాయపడింది. ‘వజ్ర’ ఏసీ బస్సులు నష్టాల వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని నివేదిక పేర్కొంది.

టీ–ఫైబర్‌ ప్రాజెక్టు పనుల కోసం

రూ.21.30 కోట్లు

జనరల్‌ ఫండ్‌కు బదులు

మరో రూ.8.60 కోట్లు అమృత్‌ నిధులు

మోడికుంట కాంట్రాక్టర్‌కు అప్పనంగా రూ.6,89 కోట్లు

భారత కంప్ట్రోలర్‌, ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక –2025లో వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement