వేడెక్కిన ఓరుగల్లు
జోరందుకున్న ‘పుర’పోరు..
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ‘మున్సిపల్’ పోరు
సాక్షిప్రతినిధి, వరంగల్:
ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియగా.. 260 వార్డులకు 1,073 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో సాగుతుండగా, బీఆర్‌ఎస్, బీజేపీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ప్రచారానికి మరో ఐదు రోజులే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి.
రెబల్స్‌పై బుజ్జగింపుల అస్త్రం
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా ఆరు రోజులే ఉండడంతో రెబల్స్‌ను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో పోటీ చేస్తుండగా.. 40 చోట్ల రెబల్స్ బెడద ఉంది. ఒంటరి పోరు చేస్తున్న బీఆర్‌ఎస్‌కు సైతం రెబల్స్ సెగ తాకుతోంది. నర్సంపేట, వర్ధన్నపేటలో ఎనిమిది చోట్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, బీఆర్‌ఎస్ నుంచి 06 ఆరుగురు రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉండగా, వారితో పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, మరిపెడలో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్‌ఎస్ నుంచి నలుగురు, కేసముద్రంలో కాంగ్రెస్ నుంచి ఒక్కరు, బీఆర్‌ఎస్‌లో ఇద్దరు చొప్పున రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరందరితో ఆ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు నేడో రేపో కొలిక్కి రావచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 12 మున్సిపాలిటీల్లో మొత్తం 260 వార్డులకుగాను ఒకచోట బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాగా 26 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేరు.
అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీ, ఏఐఎఫ్‌బీ తదితర పార్టీలు, స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ‘పుర’ పీఠాలు లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు.. ఆ పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్)లను నియమించింది. వారు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలను కలుపుకుని సమన్వయం చేస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకుడు పి.విశ్వనాథన్ ఉమ్మడి జిల్లాలో బుధవారం పర్యటించగా.. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి జేఎస్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం, పరకాలలో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 12 మున్సిపాలిటీలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, అరూరి రమేశ్ తదితరులు అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థుల గెలుపు కోసం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జిల్లా అధ్యక్షులను సమన్వయం చేస్తున్నారని, త్వరలోనే వారి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతల ప్రచారం
8న భూపాలపల్లి, పరకాలకు
సీఎం రేవంత్‌రెడ్డి..
బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రులు
కేంద్ర మంత్రులు వస్తారంటున్న
బీజేపీ నేతలు
జిల్లా మున్సిపాలిటీ వార్డులు బరిలో ఉన్న
అభ్యర్థులు
భూపాలపల్లి భూపాలపల్లి 30 107
ములుగు ములుగు 20 83
హనుమకొండ పరకాల 22 101
వరంగల్ నర్సంపేట 30 120
వర్ధన్నపేట 12 50
జనగామ జనగామ 30 127
స్టేషన్‌ఘన్‌పూర్ 18 82
మహబూబాబాద్ మహబూబాబాద్ 36 155
డోర్నకల్ 15 64
కేసముద్రం 16 58
మరిపెడ 15 63
తొర్రూరు 16 63


