ధన ప్రవాహం
భూపాలపల్లి అర్బన్: పల్లెపోరు చివరి దశకు చేరింది. నేడు (బుధవారం) జరగనున్న మూడో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పంచాయతీ పోరు మొదలైనప్పటి నుంచి అభ్యర్థులు ఇవే చివరి పంచాయతీ ఎన్నికలు మళ్లీ ఎప్పుడూ ఉండవన్న రీతిలో డబ్బును ఖర్చు చేస్తున్నారు. చివరికి గ్రామపంచాయతీల్లో వార్డుమెంబర్‌లుగా పోటీలో ఉన్న వారు కూడా లక్షల్లో ఖర్చు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎంత ఖర్చు అయినా ఫరవాలేదు కానీ గెలిచి తీరాలని అభ్యర్థులు మొదటి, రెండో విడతలో విపరీతంగా ఖర్చు చేశారు. జీవనోపాధిగా ఉన్న ఆటో, డీసీఎంలు అమ్మి కొంతమంది పోటీ చేస్తే, మరికొంత మంది పొలాలు, చేలు అమ్మి పోటీ చేశారు. గ్రామంలో పరువు కోసం పాకులాగే పెద్దమనుషులు కూడా తాము నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడిచిన రెండు దశల్లోనూ గ్రామాల్లో డబ్బు, మద్యం ఏరులైపారింది. ప్రస్తుతం జరగనున్న మూడో దశ బరిలో ఉన్న అభ్యర్థులకు మొదటి రెండు దశల్లో ఖర్చులను చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే డబ్బు తీసుకుని ఓటు వేద్దాం అనుకుంటున్న ఓటర్లకు ఇప్పుడు రికవరీల భయం పట్టుకుంది. ఒకవేళ డబ్బులు ఇచ్చిన వ్యక్తి గెలవకుంటే ఇచ్చిన డబ్బు తిరిగి అడుగుతారనే భయం కూడా కొంత మంది ఓటర్లలో ఉంది.
విచ్చల విడిగా ధన ప్రవాహం
సర్పంచ్ అయితే కనీసం రూ. 5 లక్షలు, వార్డు మెంబర్ అయితే రూ.20,000 ఖర్చు కావాల్సిందే అన్న రీతిలో ఎన్నికలు సాగాయి. బరిలో ఉన్న వ్యక్తులు ఆ మాత్రం ఖర్చు చేయకుంటే బయటపడరనే ఉద్దేశం ఇటు అభ్యర్థుల్లో, అటు ప్రజల్లో ఉన్నట్టుంది. అందుకే గడిచిన రెండు దశల్లో అభ్యర్థులు విపరీతంగా ఖర్చుచేశారు. కొన్ని పంచాయతీల్లో రూ.30లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లు కలిసి వచ్చిన వారు, పంచాయతీ బరిలో ఉన్నవారు చాలా మంది ఉన్న భూములను అమ్మి మరీ ఖర్చు పెట్టారు. ఉన్న ఎకరం, అర ఎకరాన్ని కూడా ఎన్నికల్లో తాకట్టుపెట్టారు. ముఖ్యంగా మొదటి రెండో విడతలో ఎన్నికలు పూర్తయిన భూపాలపల్లి, చిట్యాల, గణపురం మండలాలతో పాటు నేడు జరగనున్న కాటారం, మహదేవపూర్‌లోనే ఎక్కువగా ఖర్చు పెట్టారనేది ప్రజల్లో ఉన్న మాట. పెద్ద గ్రామ పంచాయతీల్లో ఉన్న గ్రామాల్లో పెద్ద మనుషులుగా ఉన్న వారి మాటే చెల్లుబాటు అవుతోంది.
రికవరీల భయం
ఓడిపోయిన అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు ఎక్కడ అడుగుతారనే భయం కొంత మందిలో నెలకొంది. ఇటీవల జిల్లాలోని ఓ మండలంలో ఓటమి పాలైన అభ్యర్థి దాడికి పాల్పడగా, కొన్ని జిల్లాల్లో ఓడిన అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు రికవరీ చేశారనే వార్తలు రావడంతో కొంత మంది డబ్బు తీసుకోవడానికి జంకుతున్నారు. ఎన్నికల ముందు రోజు రాత్రి నుంచి ఉదయం వరకు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల ముందురోజు ఇంటింటికీ తిరిగి తలుపు తట్టి మరీ ఓటుకు ఇంత చొప్పున డబ్బులు పంచుతున్నారు. వద్దంటున్న కొంత మందికి బలవంతంగా చేతిలో పెడుతున్నారు. మరికొంత మంది మా ఇంట్లో ఇంత మంది ఓటర్లు ఉన్నారని బహిరంగంగానే పోటీలో ఉన్న వారికి చెప్పి డబ్బులు తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. రెండు దశల్లో కూడా ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం డబ్బులు తీసుకోవడానికి కొంత మంది జంకుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో
విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ
నేడు మూడో దశలోనూ అదే పరిస్థితి
ఆస్తులు అమ్మి మరీ పోటీలో ఉన్న
అభ్యర్థులు


