వేలంలో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌కుమార్ మాట్లాడారు. కోలిండియా వ్యాప్తంగా 41బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రభుత్వం వేలంవేసే ప్రక్రియ ప్రారంభించిందన్నారు. అందులో భాగంగా మణుగురు ఏరియాలోని డిప్‌సైట్ బొగ్గు బ్లాక్‌ను వేలంలో పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలైన ఆదాని, ఏఎంఆర్, మేఘా కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్నారు. ఇప్పటికే ఏడు కంపెనీలు టెండర్‌ఫారాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనేందుకు వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్‌కోకు వేలం వేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. మణుగురు ఓసీని సింగరేణి దక్కించుకోకుంటే మణుగురులో సింగరేణి మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్‌కో వేలంలో పాల్గొనడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తుందని, వెంటనే జెన్‌కో సంస్థ వేలం నుంచి విరమించుకోవాల ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల రమేష్, మాతంగి రామచందర్, చంద్రమౌళి, సత్తి, కుమారస్వామి, బాబురావు పాల్గొన్నారు.


