రాత్రంతా బేరాలు..
కాళేశ్వరం: జిల్లాలో మొదటి విడత, రెండో విడత పోలింగ్ ఫలితాలను అనుభవంగా తీసుకుంటూ, మూడో విడడతలో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా మంథని నియోజకవర్గంలోని కాటారం సబ్‌డివిజన్‌లోని సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. పోలింగ్‌కు ముందు అర్ధరాత్రి 12గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రత్యర్థి ఎంత ఇస్తున్నాడన్న సమాచారాన్ని వారి నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంటూ, అంతకంటే 10శాతం నుంచి 20 శాతం ఎక్కువ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో తెల్లవారుజాము వరకు ఓటుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు, మరికొన్ని కీలక గ్రామాల్లో రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎలక్షన్ కమిషన్ నిఘా, అనేక బృందాలు 24 గంటల పాటు నిఘా ఉంచినప్పటికీ, ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు ఎలా పంచారనే దానిపై సామాన్య ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.
ఓటములే పాఠాలు..
మొదటి, రెండో విడతలో కొన్నిచోట్ల గెలుపు వాకిట నిలిచిన అభ్యర్థులు చిన్న చిన్న తప్పిదాలతో ఓటమి పాలవ్వడంతో, మూడో విడతలో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదన్న ఆలోచనతో డబ్బుల పంపిణీతో పాటు రాత్రింబవళ్లు కాళ్లబేరాలు, వ్యక్తిగత సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. డబ్బులు, మద్యం, ఇతర గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ జోరుగా సాగినట్లు తెలిసింది. గెలుపు కోసం పడరాని పాట్లు పడుతూ లక్షలు ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు వెనుకాడడం లేదు.
మొదటి, రెండో విడతలో ఓడిన అభ్యర్థుల అనుభవాలే గుణపాఠం
కీలక గ్రామాల్లో ఓటుకు రూ.2 వేల నుంచి 3వేలు


