ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు
కాటారం: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలీస్‌శాఖ ద్వారా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, సజావుగా జరిగేలా 570 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాలను విడిచిపెట్టరాదని ఆదేశించారు. రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని ఫలితాలు ప్రకటించిన అనంతరం గెలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే కార్యక్రమాలు నిర్వహించడం పూర్తి నిషేధం అన్నారు. ఎన్నికల నియమావళిని ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


