మైన్స్ రెస్క్యూ బృందాల సేవలు కీలకం
భూపాలపల్లి అర్బన్: ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే మైన్స్ రెస్క్యూ బృందాల సేవలు అత్యంత కీలకమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. 54వ ఆలిండియా మైన్స్ రెస్క్యూ కాంపిటిషన్ నాగ్‌పూర్‌లో జరిగిన పోటీల్లో సింగరేణి రెస్క్యూ సిబ్బంది పాల్గొని పతకాలు సాధించిన సందర్భంగా మంగళవారం ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఈ విజయానికి ఉద్యోగుల క్రమశిక్షణ, కఠిన శిక్షణ, అంకితభావమే ప్రధాన కారణాలని తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించడం ద్వారా సింగరేణి సంస్థ ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింత పెరిగిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పోటీల్లో సింగరేణి ఉద్యోగులు మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మైన్స్‌లో భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని ఈ విజయం ఇస్తుందని చెప్పారు. యువ ఉద్యోగులు ఈ రెస్క్యూ బృందాల విజయాల నుంచి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు. పతకాలు సాధించిన వారిలో భాను, మధు, శ్యామ్, ప్రమోద్, మహిళా రెస్క్యూ సిబ్బంది గాయత్రి, కృష్ణవేణి, మౌనిక ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం కవీంద్ర, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, రెస్క్యూ ఇన్‌చార్జ్ పూర్ణచందర్ పాల్గొన్నారు.


