ఎగనామం | - | Sakshi
Sakshi News home page

ఎగనామం

Nov 4 2025 7:38 AM | Updated on Nov 4 2025 7:38 AM

ఎగనామం

ఎగనామం

విధులకు

ఏరియాలో విధులకు దూరంగా యువకార్మికులు

వందలాది మంది కార్మికుల పరిస్థితి ఇదే..

భూగర్భ గనుల్లో విధులకు విముఖత

నియామకాల్లో జాగ్రత్తలు తీసుకోని యాజమాన్యం

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి సంస్థలో పలువురు కార్మికులు తరచూ విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. కార్మికులందరూ విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం కూడా విఫలమవుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా వరుసగా గనుల వారీగా కౌన్సెలింగ్‌ నిర్వహించి విధులకు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోతుంది.

సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలో 12 ఏరియాల్లో విస్తరించి ఉంది. సంస్థ పరిధిలో 41,013 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా 24 భూగర్భ, 18 ఓపెన్‌ కాస్ట్‌ గనులతో పాటు కార్పొరేట్‌, వర్క్‌షాప్‌, సివిల్‌ తదితర విభాగాల్లో పనులు చేస్తున్నారు. కార్మికుల్లో చాలామంది తరచుగా విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సంస్థ పరంగా తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సంస్థ ఏడాదిలో దాదాపు 365రోజులు బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పండగలు, వారాంతపు సెలవు రోజుల్లో పనిచేసే వారికి డబుల్‌ మస్టర్లు ఇస్తుంది. ఇలాంటివి వద్దనుకుంటే కనీసం మూడు వందల రోజులు పని దినాలుగా ఉంటాయి. ఏడాదంతా కలిపినా కనీసం వంద రోజులు కూడా పనిచేయడానికి ఇష్టపడని కార్మికుల సంఖ్య సింగరేణిలో అధిక శాతంగా ఉంది.

భూగర్భ గనుల్లోనే..

సర్ఫేస్‌, కార్పొరేట్‌ ఏరియాలతో పాటు ఓపెన్‌కాస్ట్‌, అండర్‌ గ్రౌండ్‌ మైన్లు అన్నింటా విధులకు గైర్హాజరు అవుతున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉంటుంది. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఇప్పటికే సంస్థ పరిధిలో ఉన్న భూగర్భ గనులన్నీ తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఓపెన్‌ కాస్ట్‌ మైన్లతో పోల్చితే భూగర్భ గనుల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్మికుల గైర్హాజరుతో ఈ నష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. తరచుగా విధులకు హాజరుకాని కార్మికులతో పని చేయించేందుకు నూతన విధానాలు, పద్ధతులేవీ సంస్థలో అమలుకావడం లేదు. తాతల కాలం నాటి కౌన్సెలింగ్‌తోనే సరిపెడుతున్నారు. నూతనంగా తీసుకువస్తున్న విధానాల వలన మార్పులు వస్తాయని అధికారులు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.

పొంతనలేక..

కారుణ్య నియామకాల ద్వారా వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిన తర్వాత పద్నాలుగు వేల మంది సంస్థలో నియమితులయ్యారు. ఇలా సంస్థలో చేరుతున్న వారికి పాత పద్ధతిలోనే భూగర్భ గనుల్లో పనులు కేటాయించడం వల్ల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కారుణ్య నియామకాల ద్వారా సంస్థలో చేరే ఉద్యోగుల విషయంలో వారి విద్యార్హతలు ఆసక్తులకు మధ్య పొంతన ఉండేలా సరికొత్త విధా నం అమల్లోకి తీసుకురావాలనే డిమాండ్‌ వస్తుంది. మ్యాన్‌రైడింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేయడంలోనూ జాప్యాన్ని నివారించాల్సిన అవసరం ఉంది.

కారణాలు ఇలా..

గడిచిన తొమ్మిదేళ్లల్లో నోటిఫికేషన్ల కంటే మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ప్రక్రియ ద్వారానే ఎక్కువ మంది సింగరేణిలో ఉద్యోగులుగా చేరారు. ఇలా ఉద్యోగాలు పొందుతున్న వారిలో 90 శాతం మంది భూగర్భ గనుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. వీరు కనీసం 190 మస్టర్లు చేసిన తర్వాతే సర్వేస్‌కు అర్హత పొందుతారు లేదా ఇంటర్నల్‌ పరీక్షలు రాయడం ద్వారా పదోన్నతి పొందే అవకాశం ఉంది. అప్పటివరకు భూగర్భ గనుల్లో కఠినమైన ప్రదేశాల్లో పనులు చేయాల్సి ఉంటుంది. గతంతో పోల్చితే ఇప్పుడు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారిలో దాదాపు అందరూ విద్యావంతులే ఉంటున్నారు. ఐటీఐ వంటి వృత్తివిద్యతో పాటు ఇంజనీరింగ్‌, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చేసినవారు కారుణ్య నియామకాల ద్వారా సంస్థలో ఉద్యోగం పొందుతున్నారు. తమ విద్యార్హతలకు గనిలో చేసే పనికి పొంతన లేకపోవడంతో ఎక్కువ మంది విధులకు హాజరయ్యేందుకు మొగ్గు చూపడం లేదు.

భూపాలపల్లి ఏరియాలో పనిచేస్తూ అనారోగ్య బారిన పడిన కార్మికుడు మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన తరువాత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్న తన కుమారుడికి సింగరేణిలో బదిలీ వర్కర్‌గా ఉద్యోగం పెట్టించాడు. విద్యార్హతలకు అనుగుణంగా సింగరేణిలో ఉద్యోగ అవకాశం కల్పించలేదు. భూగర్భంలోకి వెళ్లి పనులు చేయలేక సింగరేణి ఉద్యోగం వదిలి మళ్లీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి వెళ్లాడు.

తన కొడుకు సింగరేణిలో ఉద్యోగం చేసి ప్రయోజకుడు అవుతాడని, ఉద్యోగం ఉంటేనే పెళ్లి అవుతుందని.. అమ్మాయిని ఇస్తారని భావించిన ఓ తండ్రి ఇంకా పదేళ్ల సర్వీస్‌ ఉన్నప్పటికీ మెడికల్‌ అన్‌ఫిట్‌ చేసుకొని తన కొడుకుకు ఉద్యోగం పెట్టించారు. బొగ్గు బాయి పనిచేయలేక చివరికి జల్సాలకు అలవాటు పడి విధులకు సక్రమంగా హాజరుకాక డిస్మిస్‌కు దగ్గర ఉన్నాడు. కట్టుకున్న భార్య కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయింది.

ఏరియాలో కార్మికులు: 5,300

100 మస్టర్ల లోపు గైర్హాజరు కార్మికులు: 1,200

150 మస్టర్ల లోపు గైర్హాజరు కార్మికులు: 2,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement