కాళేశ్వరాలయంలో కార్తీక శోభ
● ఆలయానికి రూ. 5.93లక్షల ఆదాయం
● సుమారు 20వేల భక్తుల దర్శనం
కాళేశ్వరం: కార్తీకమాసం పంచరత్నాల్లో భాగంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో మూడవ రోజు ద్వాదశి సందర్భంగా సోమవారం భక్తులు కిక్కిరిశారు. ఉదయం దేవస్థానం అర్చకులు మంగళవాయిద్యాలతో గోదావరినది వద్దకు వెళ్లి గోదావరి మాతకు పూజలు చేశారు. పాలు, నైవేద్యం సమర్పించారు. కలశాలలో గోదావరి జలాలను తీసుకువచ్చి స్వామివారి గర్భగుడిలో జలాభిషేక పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అరటి దొప్పల్లో దీపాలు వదిలి, ఇసుకతో సైకత లింగాలు చేసి పసుపు, కుంకుమతో పూజించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవార్ల ఆలయంలో ప్రత్యేకంగా మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేశారు. లక్ష ముగ్గులు వేసి లక్ష వత్తులు వెలిగించారు. భక్తులకు ఉచిత ప్రసాదం, పాలు వితరణ చేశారు. భక్తులకు చల్లని తాగునీరు అందజేశారు. సోమవారం సందర్భంగా సహస్ర దీపాలంకరణను భక్తులు ఘనంగా నిర్వహించారు. వివిధ పూజలు, లడ్డు ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.5.93 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో సందడి కనిపించింది. సుమారుగా 20వేల పైన భక్తులు దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.


