జిల్లాను తాకిన మోంథా తుపాను
మండలాలవారీగా
బుధవారం వర్షపాతం
వివరాలు(మి.మీ)
25.8 మిల్లీమీటర్ల వర్షపాతం
భూపాలపల్లి అర్బన్: మోంథా తుపాను బుధవారం జిల్లాను తాకింది. బుధవారం ఉదయం నుంచి జిల్లాలో ఈదురుగాలులు వీచాయి. మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో చిరుజల్లులు మొదలయ్యాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ముసురుతో జిల్లా తడిసి ముద్దయింది. పత్తి, మిర్చి, వరి పంటలు వర్షంతో తడిసిపోయాయి. పత్తి, మిర్చి పూత రాలిపోయింది. వరి పైరు నెలవాలింది. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్– 2, 3, తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌ల్లో రెండో షిఫ్టులో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
మోంథా తుపాను ప్రభావం నేపథ్యంలో భద్రత చర్యలో భాగంగా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం టెలికాన్ఫరెన్ఫ్ నిర్వహించి అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, వ్యవసాయశాఖ, జిల్లా వైద్యాధికారి, ఆస్పత్రుల సమన్వయం అధికారి, విద్యుత్, విద్యా, ప్రణాళిక, సంక్షేమశాఖ అధికారులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగుల్లో పెరుగుతున్న ప్రవాహాల దృష్ట్యా అత్యవసర చర్యలు, సహాయక చర్యలు, ప్రమాద నివారణ చర్యలపై సూచనలు జారీ చేశారు. జిల్లాలో వాగులు, వంతెనలు, లోతట్టు ప్రాంతాలు, ప్రమాద సూచన కేంద్రాలపై నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు.
మోంథా తుపాను ప్రభావం దృష్ట్యా భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నేడు(గురువారం) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ వెల్లడించారు. వాతావరణశాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకొని విద్యార్థులు, చిన్నారుల భద్రతా చర్యలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, మహిళా శిశు సంక్షేమశాఖ సిబ్బంది తమ పరిధిలోని విద్యార్థులకు సమాచారం అందించాలని తెలిపారు.
మండలం వర్షపాతం
రేగొండ 69.5
కొత్తపల్లి గోరి 65.5
మొగుళ్లపల్లి 40.8
టేకుమట్ల 29.8
చిట్యాల 26.0
భూపాలపల్లి 20.0
మల్హర్‌రావు 16.9
గణపురం 14.5
మహాముత్తారం 12.8
కాటారం 6.9
మహదేవపూర్ 5.8
పలిమెల 1.3
బుధవారం ఉదయం నుంచి
మొదలైన ముసురు
ఓపెన్‌కాస్ట్ గనుల్లో నిలిచిన
బొగ్గు ఉత్పత్తి
వర్షం నేపథ్యంలో
నేడు విద్యాసంస్థలకు సెలవు
భూపాలపల్లి రూరల్: మోంథా తుపాను ప్రభావంతో బుధవారం జిల్లా కేంద్రంలో ముసురు వర్షం కురవడంతో చిరువ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. అంబేడ్కర్ సెంటర్ బోసిపోయింది. తుపాను మరో రెండు, మూడు రోజులపాటు కొనసాగనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. కాగా, బుధవారం జిల్లాలో 25.8 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.


