 
															విద్యావిధానంలో నాణ్యత పెంపునకు కృషి
భూపాలపల్లి: విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని విద్యా విధానాల్లో నాణ్యత పెంపునకు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. మధ్యాహ్న భోజనం, ఆధార్ నమోదు, విద్యార్థులు, ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, ఆహార నాణ్యత తనిఖీలు, పీఎం శ్రీ పనుల పురోగతి, భవిత తదితర కార్యక్రమాలపై గురువారం కలెక్టర్ చాంబర్‌లో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, హాజరు, మధ్యాహ్న భోజన పథక అమలు, డిజిటల్ విద్య, ఫలితాల విశ్లేషణ వంటి అంశాలపై అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు క్రమం తప్పక పాఠశాలలు తనిఖీ చేయాలని సూచించారు. ఆ అంశాలపై నివేదికలు పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. యూ డైస్ నివేదిక ప్రకారం 26 బాలుర, 13 బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, 24 బాలురు, 14 బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉపయోగకరంగా లేవని ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఈ పాఠశాలలకు ప్రతిపాదనలు ఇవ్వాలని గత సమావేశంలో చెప్పానని ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థుల హాజరును రోజువారీగా పర్యవేక్షించాలన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచేలా టీచర్లు ప్రత్యేక పాఠశాల కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పెంపొందించాలని అన్నారు. పాఠశాలల నిర్వహణ ఖర్చులకు ధృవీకరణ నివేదికలు ఇవ్వాలని తెలిపారు. తన పర్యటనలో కంప్యూటర్స్ పరిశీలించానని, చాలాచోట్ల పనిచేయడం లేదని, మరమ్మతులు నిర్వహించి విద్యార్థులకు ఉపయోగంలోకి తేవాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ జీవన్, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
