 
															కోటగుళ్లలో అదనపు కలెక్టర్ పూజలు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని చెప్పారు. ఆమె వెంట ఎంపీఓ శ్రీనివాస్ ఉన్నారు.
భూపాలపల్లి: సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని నేడు(శుక్రవారం) రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియం నుంచి రన్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, యువత, ప్రజలు, వ్యాపారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే కోరారు.
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలైనట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షకు 60 మంది దరఖాస్తు చేసుకోగా 39 మంది, ఇంటర్మీడియట్ పరీక్షకు 76 మంది దరఖాస్తు చేసుకోగా 54 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. రీ వెరిఫికేషన్ కోసం నవంబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.1200 చెల్లించాల్సి ఉంటుదని తెలిపారు. వివరాలకు స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు.
భూపాలపల్లి అర్బన్: నిత్య జీవితంలో నీతి నిజాయితీగా ఉండటమే కాకుండా పారదర్శకంగా సేవలందించాలని సింగరేణి సంస్థ మాజీ సీఎండీ వీఎన్ శర్మ, విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ కోరారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సింగరేణి సీఎండీ బలరాం వారితో కలిసి గురువారం సింగరేణి భవనం నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజిలెన్స్ వారోత్సవాలు కేవలం వారం రోజులకు పరిమితం కాకుండా నిబద్ధతతో పని చేయాలన్నారు. ప్రతీ వ్యక్తి కేవలం వృత్తి జీవితంలో కాకుండా నిత్య జీవితంలోనే నీతి, నిజాయితీలో అత్యున్నత ప్రమాణాలను పాటించినప్పుడే అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేయడమే కాకుండా ప్రజలకు పారదర్శక సేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు ఎర్రన్న, జోతి, రవీందర్, రాజేశ్వర్, శైలెంద్రకుమార్, మారుతి, పోషమల్లు పాల్గొన్నారు.
చిట్యాల: మండలంలోని అంగన్‌వాడీ టీచర్స్ సమయపాలన పాటించాలని జిల్లా ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ మల్లేశ్వరి అన్నారు. గురువారం మండలంలోని నైన్‌పాక సెక్టార్‌లోని ఒడితల అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ టీచర్స్, ఆయాలకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్లేశ్వరి హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీ టీచర్లు కచ్చితంగా సమయపాలన పాటించాలని కోరారు. ఆయాలు క్రమం తప్పకుండా పిల్లలను అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. పిల్లలకు ఫ్రీ స్కూల్ కార్యక్రమాలన్నీ ఆటాపాట, కథల ద్వారా నేర్పించాలని అన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. ఆన్‌లైన్ వర్క్స్ ఎప్పటికప్పడు పూర్తి స్ధాయిలో చేయాలని చెప్పారు. అనంతరం ఇద్దరు పిల్లలకు అన్నప్రసాన చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జయప్రద, అంగన్‌వాడీ టీచర్స్, ఆయాలు పాల్గొన్నారు.
 
							కోటగుళ్లలో అదనపు కలెక్టర్ పూజలు
 
							కోటగుళ్లలో అదనపు కలెక్టర్ పూజలు
 
							కోటగుళ్లలో అదనపు కలెక్టర్ పూజలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
