
కొనుగోళ్లకు సర్వం సిద్ధం
జిల్లాలో ఐదు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు
కాటారం: సాగులో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని రైతులు సాగు చేసిన పత్తి చేతికి రావడానికి సమయం ఆసన్నమైంది. జిల్లాలోని పలు మండలాల్లో మొదటి దశలో భాగంగా రైతులు పత్తిని సేకరిస్తున్నారు. రైతులు తమ చేలలో నుంచి సేకరించిన పత్తిని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా కొనుగోలు చేయడానికి మార్కెటింగ్ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటికే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసే జిన్నింగ్ మిల్లుల్లో వేబ్రిడ్జిలు, కంప్యూటర్‌లు, ఇతర వసతులను పరిశీలించారు. జిల్లాలో ఈ ఏడాది మూడు మండలాల పరిధిలోని ఐదు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటుచేసి పత్తి కొనుగోళ్లు చేయనున్నారు. అందులో జిల్లాకేంద్రంలో ఒకటి, కాటారం మండలంలో రెండు, చిట్యాల మండలంలో రెండు సీసీఐ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే సీసీఐకి మార్కెటింగ్ అధికారులు నివేదిక అందించగా అనుమతులు సైతం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సీసీఐ ఆదేశాల మేరకు ఈ నెల 23న జిల్లాలోని అన్ని సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
జిల్లాలో 98,870 ఎకరాల్లో పత్తి సాగు..
జిల్లాలోని 12 మండలాల్లో 98,870 ఎకరాల్లో రైతులు ఈ సీజన్‌లో పత్తి సాగు చేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. 11.80 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రైతుల నుంచి వచ్చిన పత్తిని నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో వచ్చే పత్తి కొంత తేమశాతం ఎక్కువగా ఉండి నాసిరకంగా ఉంటుందని సీసీఐ ద్వారా కొనుగోలు చేయడం కష్టతరం అవుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు.
తగ్గనున్న దిగుబడి..
పత్తి చెట్లు ఎదిగే దశలో అధిక వర్షాలు కురవడంతో జిల్లాలో చాలా చోట్ల పత్తి పంట దెబ్బతింది. తెగులు సోకడంతో పాటు వర్షానికి పత్తి కాయలు మురిగిపోవడం, రాలిపోవడంతో దిగుబడిపై అధిక ప్రభావం చూపనుంది. ఎకరాకు పత్తి 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా ఐదు నుంచి ఆరు క్వింటాళ్లు సైతం దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. దీంతో లక్షలాది రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గితే సీసీఐ పత్తి కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పత్తి క్వింటాల్‌కు రూ.8,110 మద్దతు ధర..
కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు మద్ధతు ధర రూ.8110 ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం 8 ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభించనుంది. అంతకంటే తేమ శాతం ఒకటి ఎక్కువగా ఉంటే మద్ధతు ధర నుండి రూ.81.10 పైసలు తగ్గించి కొనుగోలు చేస్తారు.
జిల్లాలోని సీసీఐ కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం కలిగి ఉన్న పత్తికి మద్ధతు ధర తప్పక అందుతుంది. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తి విక్రయించాలి. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రవీణ్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి
ఈ నెల 23 నుంచి ప్రారంభం
సుమారు 11.80 లక్షల క్వింటాళ్ల
పత్తి దిగుబడి అంచనా

కొనుగోళ్లకు సర్వం సిద్ధం