
బీసీలకు సముచిత స్థానం కల్పించాలి
మొగుళ్లపల్లి: డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ అమలుచేయాలన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాల్లోనూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు కట్టబెట్టాలని చెప్పారు. బీసీలకు సముచిత స్థానం కల్పించి మాట నిలుపుకోవాలని కోరారు.
పాండవుల గుహలను సందర్శించిన విద్యార్థులు
రేగొండ: వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ క్యాంపునకు వచ్చిన విద్యార్థులు ఆదివారం మండలంలోని పాండవుల గుహలను సందర్శించారు. పాండవుల గుట్టకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ అధికారి డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ విద్యార్థులకు వివరించారు. అనంతరం పాండవుల గుహలలోని పలు ప్రదేశాలను తిలకించారు.
మందుబాబులకు అడ్డాగా పాఠశాల
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్‌పల్లి ప్రాథమిక పాఠశాల రాత్రి సమయంలో మందుబాబులకు అడ్డాగా మారుతుంది. పాఠశాలకు గేటు లేకపోవడం, ప్రహరీ ఓ మూలన కూలిపోవడంతో రాత్రి సమయాల్లో పాఠశాలలోనే మందుబాబులు మద్యం సేవిస్తున్నారు. పశువులు సైతం వస్తున్నాయి. పాఠశాలకు గేటుతో పాటు కూలిపోయిన ప్రహరీని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు
టేకుమట్ల: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై దాసరి సుధాకర్ అన్నారు. శనివారం రాత్రి మండంలోని ఎంపేడు, రామకిష్టాపూర్(వి) చలివాగు, మా నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్లు ఉడుత వెంకటేష్, రొంట్ల అవినాష్‌రెడ్డి, అప్పని రమేష్‌పై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు.
కుంటుపడుతున్న అభివృద్ధి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల పదవీ కాలం పూర్తయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందన్నారు. దీంతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది కాలయాపన తప్ప మరేం లేదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు ప్రవీణ్ కుమార్, సతీష్, సుగుణ, శ్రీనివాస్, జోసెఫ్, లావణ్య ,మహేశ్, రవికాంత్ పాల్గొన్నారు.

బీసీలకు సముచిత స్థానం కల్పించాలి