
పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర నేటి తరానికి తెలిసే విధంగా ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చేర్చాలని ిసీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 11 నుంచి 17వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఆదివారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా బస్టాండ్ సమీపంలోని అమరవీరుల స్థూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణ పతాకాన్ని రాజ్‌కుమార్ ఎగురవేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. తెలంగాణ విలీన దినోత్సవంపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కపట నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని, ట్యాంక్‌బండ్‌పై సాయుధ పోరాట యోధుల విగ్రహాలు పెడతామని, పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను చేర్చుతామని చెప్పిన హామీలను ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మోటపలుకుల రమేష్, పైళ్ల శాంతికుమార్, అన్నారపు రాజేందర్, శ్రీనివాస్, నూకల చంద్రమౌళి, నబి, నేరెళ్ల జోసఫ్, వేముల శ్రీకాంత్ పాల్గొన్నారు.