
బిల్డింగ్ కార్మికులకు అడ్డాలు ఏర్పాటు చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో కార్మికుల సౌకర్యార్థం బిల్డింగ్ కార్మికుల అడ్డాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మెహన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాలుగవ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం దుర్మార్గమన్నారు. రూ.346 కోట్లు ఇచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిధులను వెనక్కి తెప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసే కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం కార్మిక వర్గంపై ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. మహాసభలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బందు సాయిలు, చెన్నూరి రమేష్, నాయకులు గుర్రం దేవేందర్, కొమరయ్య, మునీర్‌పాషా, విజయ, ప్రీతి, సారయ్య పాల్గొన్నారు.