
హాస్టళ్లపై దృష్టి సారించాలి
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల వసతులపై అధికారులు దృష్టి సారించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య అన్నారు. ఆదివారం ఎన్‌హెచ్‌ఆర్‌సీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాటికంటి రవికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట రాజయ్య మాట్లాడుతూ జిల్లాలోని వసతి గృహాల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్‌తో బాధపడటం, విద్యుదాఘతానికి గురికావడం, అన్యమత బోధనలు చేయడం లాంటి వాటికి హాస్టల్ విద్యార్థులు బలవుతున్నా అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. కలెక్టర్ దృష్టి సారించి హాస్టళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు. జిల్లాలోని హాస్టళ్లలో పూర్తిస్థాయిలో వార్డెన్స్ లేరని, ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు అప్పగించడం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. హాస్టల్ వార్డెన్‌తో పాటు సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీచేయాలని కోరారు. లేదంటే పిల్లలు మానసికంగా, ఆరోగ్యపరంగా వేదనకు గురిచేస్తున్న ప్రతి ఒక్క అధికారిని కోర్టు మెట్లు ఎక్కిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు అమృత అశోక్, జిల్లా ఉపాధ్యక్షుడు సంగెం రాజేందర్, జిల్లా సహాయ కార్యదర్శి శిలపాక నరేష్ పాల్గొన్నారు.