
స్వచ్ఛమైన తేనెకు డిమాండ్
● తేనెటీగల పెంపకంతో ఎదగాలి
● మహిళలకు వారం రోజులు శిక్షణ
● సింగరేణి సీఎండీ బలరాంనాయక్
భూపాలపల్లి అర్బన్: స్వచ్ఛమైన తేనెకు అత్యధిక డిమాండ్ ఉందని.. తేనెటీగల పెంపకాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్ అన్నారు. గడ్డిగానిపల్లి గ్రామ భూనిర్వాసిత మహిళలకు శనివారం ఏరియాలోని సింగరేణి ఇల్లంద్ క్లబ్‌హౌజ్‌లో తేనెటీగల పెంపకం బాక్స్‌లను అందజేశారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి సీఎండీ బలరాం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాంనాయక్ మాట్లాడుతూ.. సీఎస్సార్ నిధుల నుంచి భూపాలపల్లి ఏరియాకు రూ.25లక్షలు కేటాయించి ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్–2 ప్రభావిత గడ్డిగానిపల్లి గ్రామాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. 100మంది గ్రామానికి చెందిన మహిళలకు వారం రోజుల పాటు తేనేటీగల పెంపకంపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తేనేటీగల శిక్షణను ప్రారంభించినట్లు చెప్పారు. తయారు చేసిన తేనె అమ్ముకునేందుకు కొనుగోలుదారులను తీసుకువస్తామని తెలిపారు. తేనేటీగలు వ్యవసాయ పంటలకు ఉపగయోగపడుతాయని వివరించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ. నిత్యజీవితంలో తేనె ఒక భాగమైందన్నారు. తేనెకు డిమాండ్ పెరుగుతుందన్నారు. సింగరేణి యాజమాన్యం భూపాలపల్లి ప్రాంతాన్ని ఎంపికచేసి మహిళల ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడటం సంతోషకరమైన విషయమన్నారు. సీఎస్సార్ నిధులతో భూపాలపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయాలని, మెడికల్ కళాశాల విద్యార్థులకు బస్సులను కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించాలని సీఎండీని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ, ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, కార్పొరేట్ జీఎం సైదులు, ఎస్‌వోటు జీఎం కవీంద్ర, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల ప్రధాన కార్యదర్శులు కొరిమి రాజ్‌కుమార్, రాజేందర్, అధికారులు, నజీర్, పోషమల్లు, మారుతి, జోతి పాల్గొన్నారు.