
బతుకమ్మ కానుక
8,792 మహిళా సంఘాలకు 92,371 చీరలు
రూ.800 విలువైన చీరలు..
భూపాలపల్లి: ఈ ఏడాది బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలకు ఉచితంగా చీరలను అందించాలని సర్కారు భావించింది. గతంలో మాదిరిగా అందరికీ కాకుండా మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది. ఈ మేరకు ఈ నెల 22వ తేదీ నుంచి మహిళా సంఘాల్లోని సభ్యులకు అధికారులు చీరలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో 92,371 చీరల పంపిణీ..
జిల్లాలోని 12 మండలాల్లో 8,792 మహిళా సంఘాలు ఉండగా, ఆయా సంఘాల్లోని సభ్యులకు ఒకొక్కరికి రెండు చీరల చొప్పున మొత్తం 92,371 పంపిణీ చేయనున్నారు. ఈ నెల 21 నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానుండగా 22, 23 తేదీల్లో పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి రెండు సైజుల్లో చీరలను అందించనున్నారు. 18 ఏళ్లకు పైబడి సంఘాల్లో ఉన్న సభ్యులకు 6.30 మీటర్ల పొడవైన 91,736 చీరలు, వయసు పైబడిన వారికి 9 మీటర్ల పొడవైన 635 చీరలను అందించనున్నారు.
ఆరు గోడౌన్‌లలో నిల్వ..
ప్రభుత్వం నుంచి రానున్న చీరలను గోడౌన్లలో భద్రపరిచేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. పంపిణీకి ఇబ్బంది కాకుండా జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో నిల్వ చేయనున్నారు. జిల్లాలోని మహదేవపూర్ మహిళా సమాఖ్య గోడౌన్‌లో 9,459, కాటారం కొత్త జీపీ కార్యాలయంలో 22,522, భూపాలపల్లి మెప్మా కార్యాలయంలో 23,801, రేగొండ రైతు వేదికలో 13,568, మొగుళ్లపల్లి మహిళా సమాఖ్య కార్యాలయంలో 8,629, చిట్యాల ఎంపీడీఓ కార్యాలయంలో 14,392 చీరలను భద్రపరచనున్నారు. ఆయా గోడౌన్‌లకు ఏపీఎంలను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.
చీరలు ఇంకా జిల్లాకు రాలేదు. ఉన్నతాధికారులు అందించిన సమాచారం మేరకు మూడు రోజుల్లో జిల్లాకు చీరలు వస్తాయి. నిల్వ చేసేందుకు గోడౌన్లను సిద్ధంగా ఉంచాం. చీరలు రాగానే ప్రభుత్వం సూచించిన తేదీల్లో పంపిణీ చేస్తాం.
– బాలకృష్ణ, డీఆర్‌డీఓ
మండలం మహిళా పంపిణీ
సంఘాలు చేయనున్న
చీరలు
రేగొండ 1,201 13,568
కాటారం 865 8,779
మొగుళ్లపల్లి 807 8,629
గణపురం 801 8,350
చిట్యాల 798 8,209
భూపాలపల్లి రూరల్ 786 8,163
మహదేవపూర్ 751 7,720
భూపాలపల్లి అర్బన్ 723 7,288
మహాముత్తారం 660 6,698
మల్హర్ 630 7,045
టేకుమట్ల 602 6,183
పలమెల 168 1,739
మొత్తం 8,792 92,371
మూడు రోజుల్లో జిల్లాకు రాక
ఒక్కొక్కరికి రెండు చీరలు
రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగులో
విలువైన చీరలు
‘ఇందిరా మహిళా శక్తి’ పేరిట పంపిణీ
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని మహిళలందరికీ పంపిణీ చేసిన బతుకమ్మ చీరల నాణ్యతపై విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన చీరలను అందించాలని భావించింది. ఈ మేరకు సిరిసిల్లలో ఒక్కో చీరను రూ.380 విలువతో ఉత్పత్తి చేయించిన అనంతరం రూ.420 వెచ్చించి సూరత్ తదితర ప్రాంతాల్లో ప్రాసెసింగ్, ప్రింటింగ్ చేయిస్తున్నారు. మొత్తంగా చీర విలువ సుమారు రూ. 800కు చేరకుంటుంది. రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగులో ఒకే రకమైన చీరలను ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం పేరిట పంపిణీ చేయనున్నారు.

బతుకమ్మ కానుక