
వరి సాగు సూపర్
జిల్లాలో వరిసాగు వివరాలు (ఎకరాల్లో)...
జిల్లాలో 1,13,121 ఎకరాల్లో సాగు
వరిసాగు బాగుంది..
భూపాలపల్లి: సకాలంలో వర్షాలు కురవకపోయినప్పటికీ జూలై చివరి వారం, ఆగస్టులో కురిసిన వర్షాలకు జిల్లాలో వరిపంట జోరుగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా సాగు ఒకేసారి మొదలవడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో చాలామంది రైతులు ఈ సారి వెదజల్లే పద్ధతిలో వరినాట్లు వేశారు. అయినప్పటికీ పంట ఏపుగా పెరగడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మందకొడిగా ప్రారంభమై..
ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో వర్షాలు సమృద్ధిగా పడలేదు. బోర్లు, బావులు ఉన్న రైతులు సకాలంలో వరిసాగు ప్రారంభించినప్పటికీ వర్షాభావం, జలాశయాల మీద ఆధారపడే వారు సకాలంలో వరినాట్లు వేయలేదు. జూలై చివరి వారం, ఆగస్టులో కురిసిన వర్షాలకు చెరువులు నిండి, వాగులు, వంకలు ఉప్పొంగాయి. దీంతో రైతులంతా ఒక్కసారిగా వరిపంట సాగు చేశారు. గతేడాది సుమారు లక్ష ఎకరాల్లో వరిసాగు జరుగగా, ఈ ఏడాది ఏకంగా 1,13,121 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు వరిపంటలకు అనుకూలంగా మారాయి. యూరియా కొరత కొంతమేరకు ఉన్నప్పటికీ ప్రస్తుతం వరిపంట ఏపుగా పెరిగింది. భారీ వర్షాలు, వరదలు రాకుంటే ఈ ఏడాది అంచనాకు మించి దిగుబడి అయ్యే అవకాశం ఉంది. అకాల వర్షాల కారణంగా పత్తి, మిర్చి పంటలకు ఇప్పుడిప్పుడే తెగుళ్లు ఆశించి అనుకున్న మేరకు దిగుబడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వరిపంట మాత్రం ఏపుగా పెరగడం, ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పత్తి, మిర్చి పంటల్లో వచ్చే నష్టాలను వరితో అధిగమించవచ్చని రైతులు భావిస్తున్నారు.
వర్షాలు సకాలంలో కురవకపోవడం, ఒకేసారి రైతులంతా నాట్లు వేయాల్సిన పరిస్థితి రావడంతో జిల్లాలో కూలీల కొరత ఏర్పడింది. దీంతో కాటారం డివిజన్‌లోని కాటారం, మహదేవపూర్, పలిమెల మండలాలకు చెందిన రైతులు గతంలో పక్కనున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కూలీలను పిలిపించుకొని వరినాట్లు వేయించేవారు. ఈసారి అక్కడి నుంచి సైతం కూలీలు రాలేదు. రోజువారి కూలి పెరగడం, కొరత కారణంగా కాటారం డివిజన్, భూపాలపల్లి నియోజకవర్గంలోని వందలాది మంది రైతులు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేశారు. తట్టు సంచిలో వడ్లను రెండు రోజుల పాటు నానబెట్టి చిన్నగా మొలకెత్తాక పంట పొలాల్లో వెదజల్లారు. ఈ పద్ధతిలో సైతం వరిపైరు ఏపుగా పెరిగింది. దీంతో వచ్చే ఏడాది ఇదే తరహాలో మరింత సాగు పెరిగే అవకాశం ఉంది.
ఇటీవల కురిసిన వర్షాలు నది, వాగుల పరీవాహక ప్రాంతాల్లో వరిసాగు చేసిన రైతులను తీవ్రంగా దెబ్బతిశాయి. భూపాలపల్లి నియోజకవర్గంలోని మోరంచవాగు, చలివాగు, కాటారం డివిజన్‌లోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వరిపంటలు పూర్తిగా నీట మునిగాయి. వరదల మూలంగా పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. మరికొన్ని పొలాలు నీట మునిగి దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ముంపు ప్రాంతాల్లోని రైతులు మాత్రం దిగుబడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలం వెదజల్లే నాట్లు వేసే
పద్ధతిలో సాగు పద్ధతిలో
భూపాలపల్లి 563 11,358
గణపురం 200 10,000
రేగొండ 225 7,325
కొత్తపల్లిగోరి 30 5,640
చిట్యాల 110 6,100
టేకుమట్ల 120 7,700
మొగుళ్లపల్లి 80 8,770
మహదేవపూర్ 650 7,300
పలిమెల 450 2,500
కాటారం 3,000 9,500
మల్హర్ 5,500 10,500
మహాముత్తారం 3,000 12,500
మొత్తం 13,928 99,193
ఇటీవల కురిసిన వర్షాలు అనుకూలం
కూలీల కొరతతో ఈసారి వెదజల్లే పద్ధతి
సన్న రకాలవైపే రైతుల మొగ్గు
వర్షాలు సకాలంలో కురవకపోయినప్పటికీ జూలై, ఆగస్టు మాసాల్లో కురిసిన వర్షాలు వరిపంటలకు అనుకూలంగా మారాయి. ఈ సారి జిల్లాలో అంచనా మేరకు వరిపంట సాగు జరుగుతోంది. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వస్తుంది. వరిసాగులో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు.
– బాబురావు,
ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయశాఖాధికారి

వరి సాగు సూపర్