
భక్తుల భద్రతకు చర్యలేవి?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఇటీవల జోరుగా వర్షాలు కురవడంతో మేడారం జంపన్నవాగులో వరద ప్రవాహం కొనసాగుతోంది. మొన్నటి వరకు ఇసుక దిబ్బలతో కనిపించగా నేడు నీటితో కళకళలాడుతోంది. దీంతో తొలుత స్నానఘట్టాలపై ఉన్న షవర్ కింద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు ప్రస్తుతం వాగులోనే స్నానాలు చేస్తున్నారు. వరద ఉధృతితో వాగులో భక్తులు ప్రమాదాల బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవాలని మేడారం దేవాదాయశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకేమీ పట్టనట్లుగా వ్యహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆదివారం తాజాగా అమ్మవార్ల దర్శనానికి వచ్చిన జనగామకు చెందిన కనికంటి మనీష్ జంపన్నవాగులో స్నానం చేసేందుకు వెళ్లి గల్లంతై మృత్యువాత పడ్డాడు. ఇలాంటి ఘటనలు ప్రతిఏటా వర్షాకాలంలో చోటు చేసుకుంటున్నాయి.
ప్రమాదాల నివారణకు చర్యలు నిల్..
మేడారం వచ్చిన భక్తులు చాలా మంది జంపన్నవాగు నీటిలో పుణ్యస్నానాలు చేస్తేనే మంచిదని విశ్వసిస్తారు. వాగు వరద సమాంతరంగా వెళ్లడంతో స్నానాలకు వెళ్లిన భక్తులకు నీటి లోతు తెలియకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. గతంలో భక్తులు నీట మునిగి మృత్యువాత పడిన విషాద ఘటనలు ఉన్నాయి.
హెచ్చరిక బోర్డులతో నివారణ
జంపన్నవాగులో నీటి ప్రవాహం, ప్రమాదభరితంగా ఉన్న స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. ప్రస్తుతం రెడ్డిగూడెం లోలెవల్ కాజ్‌వే వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మేడారానికి వచ్చిన భక్తులు చాలా మంది ఈ–కాజ్‌వే వద్ద నీటి ప్రదేశంలో ఎక్కువగా స్నానాలు చేస్తుంటారు. కాజ్‌వే కింద వాగులో నీరు కూడా సమృద్ధిగా ఉండడంతో భక్తులు స్నానాలు చేస్తుంటారు. కానీ లోతు కూడా భారీగానే ఉంటుంది. ఈ–కాజ్‌వే ప్రాంతంలో గతంలో పదుల సంఖ్యలో భక్తులు నీటమునిగి మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఈ లోలెవల్ కాజ్‌వే వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే ఊరట్టం జంపన్నవాగు వద్ద కాజ్‌వే ధ్వంసమైన ప్రదేశంలో కూడా నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు స్నానాలు చేస్తుంటారు. గత మూడేళ్ల క్రితం వర్షాకాలంలో ఇద్దరు భక్తులు ఒకేసారి నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. అలాగే జంపన్నవాగు వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తే పుణ్యస్నానాలు చేసే భక్తులకు సూచనలు చేయడంతో పాటు ప్రమాదవశాత్తు నీటమునిగిన భక్తులను కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
జంపన్నవాగులో ప్రవహిస్తున్న వరద
హెచ్చరిక బోర్డులు కరువు
పట్టించుకోని అధికారులు