సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందేనా? | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందేనా?

Sep 7 2025 7:48 AM | Updated on Sep 7 2025 7:48 AM

సూపర్

సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందేనా?

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో అన్ని విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఆశించారు. కానీ గతంలో అందించిన సేవలే కొంత మెరుగుపడటం మినహా అత్యంత అవసరమైన సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. వివిధ రకాల కాలుష్యాలతో భూపాలపల్లి, చెల్పూర్‌ పారిశ్రామిక ప్రాంతంలో యూరాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీటికి సంబంధించిన వైద్య సేవలు భూపాలపల్లిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో వరంగల్‌, హనుమకొండ, హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖర్చులు భరించలేనివారు దేవుడిపై భారం వేసి స్థానికంగా నామమాత్రపు చికిత్సలతో సరిపెట్టుకుంటున్నారు. ప్రాథమిక దశలోనే ఆయా వ్యాధులను గుర్తిస్తే నివారణ సులభతరమయ్యే అవకాశముంది. స్థానికంగా ఆయా విభాగాల్లో చికిత్స, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారంగా న్యూరాలజీ, కార్డియాలజీ విభాగాల్లో ఓపీ గదులను ఏర్పాటు చేసినప్పటికీ కేవలం యూరాలజీ వైద్యులు వారంలో రెండు రోజులు మాత్రమే వస్తుండగా, న్యూరాలజీ, కార్డియాలజీ వైద్యులు లేరు.

యూరాలజీ, న్యూరాలజీలోనూ..

మూత్రపిండాలకు సంబంధించిన యూరాలజీ, నరాలకు సంబంధించి న్యూరాలజీ విభాగాల్లోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ తదితర వైద్యులు అందుబాటులో ఉంటే ప్రాథమిక దశలోనే కిడ్నీ వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే రక్తశుద్ధి వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మెదడు, నరాలకు సంబంధించిన కేసులు సైతం అధికంగానే ఉంటున్నాయి. న్యూరాలజీ వైద్యులు అందుబాటులో ఉంటే సకాలంలో చికిత్స అందే అవకాశం ఉంటుంది. ప్రైవేట్‌లో కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేతనాలు తక్కువగా ఉండటంతో పాటు పట్టణాలకు దూరంగా ఉండటంతో ఆయా విభాగాల్లోని వైద్యులు భూపాలపల్లి వైద్య కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.

‘క్యాథ్‌ ల్యాబ్‌’ ఏర్పాటుతోనే..

మారుతున్న ఆహారపు అలవాట్లు, జల, వాయు, కాలుష్యాలు తదితర కారణాలతో కొంతకాలంగా గుండెపోటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య ఇటీవల అధికంగా ఉంది. భూపాలపల్లి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ‘క్యాథ్‌ ల్యాబ్‌’ సదుపాయంతో పాటు గుండె వైద్య నిపుణులు అందుబాటులో ఉంటే ఇందులో అత్యధిక మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఇందులో ఉపయోగించే ప్రధాన యంత్రానికే సుమారుగా రూ.కోటి వరకు ఖర్చు కానుండగా పూర్తిస్థాయిలో ‘క్యాథ్‌ ల్యాబ్‌’ ఏర్పాటునకు దాదాపుగా రూ.8 కోట్లు అవసరం కానుంది. స్థానిక వైద్య కళాశాల, ఆస్పత్రి భవనాల నిర్మాణంలో సంపూర్ణ సహకారాన్ని అందించిన సింగరేణి, కేటీపీపీ పరిశ్రమలు సమాజహితం కోరి నిధులు కేటాయిస్తే భూపాలపల్లిలో క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటు సులభతరం కానుంది. ిసింగరేణి, కేటీపీపీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడనుంది.

న్యూరో, కార్డియాలజీ, యూరాలజీ సేవలు కరువు

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకం ఎప్పుడో..

అత్యవసర సేవలకు వరంగల్‌, హైదరాబాద్‌కు రోగులు

త్వరలో సీటీ స్కాన్‌ సేవలు అందుబాటులోకి..

ఈసీఐఎల్‌ ఆధ్వర్యంలో సీటీ స్కాన్‌ ఏర్పాటు..

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ ప్రత్యేకంగా దృష్టిసారించి సీటీ స్కాన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈసీఐఎల్‌ సంస్థ నుంచి సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయించారు. సంస్థ సహకారంతో జిల్లా ప్రజలకు ఖరీదైన స్కానింగ్‌ సేవలు అందనున్నాయి. ఇప్పటికే సీటీ స్కానింగ్‌ యంత్రాన్ని టీ–హబ్‌ భవనంలో అమర్చి ఉంచారు. ఈ నెల రోజుల్లోపు ప్రారంభించే అవకాశం ఉంది. స్కానింగ్‌ ప్రారంభం నాటికి న్యూరో స్పెషలిస్టు డాక్టర్‌ను నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందేనా?1
1/1

సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement