
రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి
కాటారం: గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. కాటారం మండలం మద్దులపల్లి, కొత్తపల్లి గ్రామపంచాయతీలను శనివారం అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు, ఇతరత్రా రికార్డులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ఆరా తీశారు. కొత్తపల్లి ఇందిరా మహిళాశక్తి ద్వారా నిర్వహిస్తున్న టిఫిన్ సెంటర్‌ను సందర్శించి ఆహార పదార్థాల నాణ్యత, అమ్మకాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఫ్లాంటేషన్ పనులు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఫ్లాంటేషన్‌లో మొక్కల సంరక్షణకు తగు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, రేంజర్ స్వాతి ఉన్నారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి