
నేడు సంపూర్ణ చంద్రగ్రహణం
కాళేశ్వరం: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం (నేడు) ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు (మూసివేత) ద్వార బందనం చేయనున్నట్లు ఈఓ మహేష్, ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరిగి ఆలయం 8వ తేదీన సోమవారం సంప్రోక్షణాది పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 7.30 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
భూపాలపల్లి అర్బన్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ స్టేషన్ల వారీగా శనివారం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసినట్లు జెడ్పీ సీఈఓ, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 9న అభ్యంతరాలపై సూచనలను పరిష్కరించనున్నట్లు చెప్పారు. 10వ తేదీన తుది జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. జిల్లా ఎన్నికల అఽధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.
కాళేశ్వరంలో
501 విగ్రహాల నిమజ్జనం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు జరిగిన గణపతి విగ్రహాల నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, డీఎస్పీ సూర్యానారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, నాగార్జునరావు, ఎస్సై తమాషారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు, బందోబస్తు నిర్వహించారు. మొత్తం 501 కిపైగా విగ్రహాలు త్రివేణి సంగమ గోదావరిలో నిమజ్జనం చేసినట్లు తెలిసింది.
పంచాయతీరాజ్ ఈఎన్సీ పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని పంచాయతీరాజ్ ఈఎన్సీ నగునూరి అశోక్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. శనివారం ఆయన ఆలయానికి రాగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేసి శ్రీఽశుభానందదేవి అమ్మవారికి పూజలు చేశారు. ఆశీర్వచన వేదిక వద్ద ఆలయ అర్చకుడు బైకుంఠపాండా శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు.
ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్స్ పీపుల్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు శనివారం ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభించారు. ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన క్రీడా పోటీలకు ఏఈజీ(ఐఈడీ) జోతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ఆటల్లో పాల్గొనాలని సూచించారు. సింగరేణి క్రీడాకారులు కోలిండియా స్థాయిలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు మారుతి, బ్రహ్మకుమారీస్, చేతన, శ్రీనివాస్, క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొన్నారు.
హేమాచలుడిని దర్శించుకున్న ఐటీడీఏ పీఓ
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన పీఓకు ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేష్, పూజారులు స్వాగతం పలికారు. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్న పీఓ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు.

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం