
నిమజ్జనానికి ఏర్పాట్లు
కాళేశ్వరం: తొమ్మిది రోజులు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరడానికి పయనమయ్యాడు. తొమ్మిది రోజులు అత్యంత భక్తిశ్రద్దలతో కొలిచిన భక్తులు ఆదిదేవుడిని నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీగా గణనాథుల విగ్రహాలను మహదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భక్తులు ప్రతియేటా తరలివస్తారు. శుక్రవారం(నేడు) కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు, ఎన్పీడీసీఎల్, ఫిషరీస్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వంతెనపై రెండు చోట్ల నిమజ్జనం చేయడానికి వీలుగా రెండు స్టాండ్లు, ఒక జనరేటర్ ఏర్పాటు చేశారు. వంతెనపై అక్కడక్కడా లైట్లు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం బస్టాండ్ నుంచి వంతెన వరకు విద్యుత్ దీపాలు అమర్చారు. రోడ్డుకు ఇరువైపులా చదును చేశారు. రోడ్డుపై గుంతలను పూడ్చివేసి వాహనాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 500లకు పైగా విగ్రహాలు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పెద్దపల్లి, మంథని, కరీంనగర్ తదితర పట్టణాల నుంచి తరలిరానున్నాయి.
పకడ్బందీ బందోబస్తు..
ఎస్పీ కిరణ్‌ఖరే, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరంలో వినాయక నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నదిలో వినాయక నిమజ్జనం నిమిత్తం జిల్లా నుంచి ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 250 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. కాళేశ్వరం గోదావరి నదిలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వచ్చే భక్తులు పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. వాహనాలకు డీజే సౌండ్ బాక్స్‌లు పెట్టకుండా ఉండాలి. వెహికల్స్ కండిషన్‌లో ఉండేటట్లు చూడాలి. తాగి వాహనం నడపకూడదు. వాహన డ్రైవర్‌కు లైసెన్స్ కలిగి ఉండేటట్లు చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నిమజ్జనం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు పేర్కొంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు నిఘాను తీవ్రం చేపట్టారు.
కాళేశ్వరం గోదావరిలో నిమజ్జనానికి వందలాదిగా తరలివచ్చే వినాయక వాహనాలు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకోవాలి. వాహనాలు పోటీలు పడి ప్రమాదానికి గురికావొద్దు. తాగి వాహనం నడపొద్దు. పోలీసుల సూచన మేరకు నడుచుకోవాలి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతుకు వెళ్లరాదు. ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలి.
– సూర్యనారాయణ, డీఎస్పీ, కాటారం
నేడు కాళేశ్వరం తరలిరానున్న గణనాథులు
అంతర్రాష్ట్ర వంతెన వద్ద
పకడ్బందీ బందోబస్తు

నిమజ్జనానికి ఏర్పాట్లు