
నానో యూరియాతో రైతులకు ప్రయోజనం
కాటారం: నానో యూరియా వినియోగం ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డీఏఓ మాట్లాడుతూ.. సాధారణ యూరియా కంటే నానో యూరియా పంట సాగులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడితోపాటు పర్యావరణ కాలుష్య నియంత్రణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులు నానో ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం డీఏఓ పీఏసీఎస్‌తోపాటు మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా, ఇతర ఎరువుల స్టాక్, రిజిస్టర్లను పరిశీలించారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఏఓ వెంట ఏడీఏ శ్రీపాల్, ఏఓ పూర్ణిమ, పీఏసీఎస్ సీఈఓ సతీశ్, ఏఈఓ ఉన్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు