
రద్దీగా జిల్లాకేంద్రం
భూపాలపల్లి అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు జిల్లాలోని నలుమూలల నుంచి వినాయక విగ్రహాలను ఎక్కువ సంఖ్యలో కాళేశ్వరంలోని గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు భూపాలపల్లి పట్టణం మీదుగా తరలించారు. దీంతో జిల్లా కేంద్రం రద్దీగా మారింది. కాళేశ్వరంతో పాటు లక్నవరం, ఏటూరునాగారం ఇతర ప్రదేశాలకు విగ్రహాలను డప్పు వాయిద్యాల నడుమ తరలించారు. భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సైతం కాళేశ్వరంలోని తివ్రేణి సంగమంలో నిమజ్జనం చేసేందుకు తరలించారు. యువకులు, మహిళలు ప్రత్యేక దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. కాలనీల నుంచి వచ్చే వినాయక మండలికి చెందిన వినాయక విగ్రహాల ఎదుట మహిళలు కోలాటం ఆడుతూ.. సాంప్రదాయ బద్ధంగా మంగళహారులతో గణపయ్యను గంగమ్మ చెంతకు సాగనంపారు. పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు చేయగా ఎస్పీ కిరణ్‌ఖరే పరిశీలించారు.
నిర్వాహకులకు సన్మానాలు
నిమజ్జనానికి కాళేశ్వరం తరలివెళ్లే వినాయక విగ్రహాల నిర్వాహకులకు, కమిటీ సభ్యులకు అంబేడ్కర్ సెంటర్‌లో ధర్మవాహిని గణేష్ ఉత్సవ కమిటీ, గణేష్‌చౌక్‌లో ధర్మజాగరణ గణేష్ ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి జ్ఙాపికలను అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమాలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, నిర్వాహకులు దేవన్, రమేష్, అనిల్, వెంకన్న, రవీందర్, ప్రభాకర్, భిక్షపతి, యుగేందర్, రవీందర్, మధుసూదన్, రాజేందర్, సంజీవరావు పాల్గొన్నారు.