
పత్తి రైతు.. చిత్తు
భారీ వర్షాలతో ఎర్రబారిన పత్తిచేలు
భూపాలపల్లి రూరల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకు గండం పొంచి ఉందంటూ పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటభూముల్లో వాననీరు నిలిచి ఉండడంతో తెగుళ్లు వ్యాప్తి చెందుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు తేమ శాతం పెరిగి పత్తి పూత నేలరాలుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రైతులు అధికంగా పత్తి పంటను నమ్ముకున్నారు. పత్తి సాగు చేసిన నాటినుంచి కాపు దశకు వచ్చే వరకు వర్షాలు వెంటాడుతుండడంతో పంట దిగుబడులు సగానికి తగ్గిపోయే ప్రమాదం ఉందని, పెట్టుబడులు వస్తాయో.. రావోనని దిగాలు చెందుతున్నారు. ఈఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో పత్తి చేలల్లో కలుపు సమస్య, తెగుళ్ల సమస్యలు అధికమయ్యాయి.
గతేడాది ఇదే పరిస్థితి..
గతేడాది జిల్లాలో 92,320 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంట కాపు దశకు వచ్చిన నాటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా వర్షాల వల్ల 6 క్వింటాళ్లకు పడిపోయింది. వర్షాలకు తడిసిన పత్తికి మార్కెట్లో తేమ శాతం పేరుతో మద్దతు ధర పలకలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కలుపు సమస్య.. కూలీలకు డిమాండ్
జిల్లాలో 1.20 లక్షల మందికి పైగా రైతులు ఈ వానాకాలం సీజన్‌లో 98,260 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పంటలోపెరిగిన కలుపు తీసేందుకు కూలీలకు డిమాండ్ పెరిగింది. ఒక్కో కూలీ రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు డిమాండ్ చేస్తున్నారు. దీనిని అధిగమించేందుకు రైతులు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి కలుపుతీత పనులు చేయిస్తుండడం గమనార్హం.
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు పిల్లి కొమురయ్య, భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పిల్లోనిపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు.. నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఒక్కో ఎకరాకు ఇప్పటికే రూ.30 వేలు ఖర్చు చేశాడు. పంట బాగా వస్తుందని ఆశపడ్డాడు. కానీ, గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటచేనులో నీళ్లు నిలిచి మొక్కలకు ఎర్రతెగులు సోకింది. పూత రాలిపోయింది. దీంతో దిగుబడి వచ్చే పరిస్థితి లేదని.. అప్పులే మిగులుతాయేమోనని ఆందోళనకు గురవుతున్నాడు.
పెరిగిన గడ్డి, చీడపీడలు
తేమశాతం పెరిగి రాలుతున్న పూత
దిగుబడిపై ప్రభావం
తప్పదంటున్న రైతులు
జిల్లాలో 98,260 ఎకరాల్లో సాగు

పత్తి రైతు.. చిత్తు

పత్తి రైతు.. చిత్తు