
సారూ.. మా సమస్యలు పరిష్కరించండి
భూపాలపల్లి అర్బన్: సారూ.. మా పాఠశాలలో సమస్యలు ఉన్నాయి.. పరిష్కరించండి.. అంటూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు తమ సమస్యలను వివరించారు. బుధవారం ఉదయం ఆశ్రమ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కిచెన్‌షెడ్, వంట సామగ్రి పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంట్ ఏడాది కాలంగా పని చేయడం లేదని, వేడి నీటికి గ్లీజర్ ఏర్పాటు చేయాలని, మూడు నెలలు కాస్మోటిక్ సామగ్రి ఇవ్వడం లేదని, డిజిటల్ క్లాస్ పరికరాలు పనిచేయడం లేదని ఎమ్మెల్యేకు తెలిపారు. దోమలు రాకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు సరిగ్గా తిరగడం లేదని విద్యార్థులు చెప్పారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే.. సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ పీఓకు ఫోన్‌లో చెప్పారు. బాలికల గురుకులం పక్కన ఏర్పాటు చేసిన బాలుర పోస్ట్‌మెట్రిక్ హాస్టల్‌ను వేరే చోటుకు తరలించాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
తనిఖీకి వచ్చిన ఎమ్మెల్యేకు
విద్యార్థుల సమస్యలు ఏకరువు
పరిష్కరించాలని ఐటీడీఓ పీఓకు ఎమ్మెల్యే సూచన