
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
భూపాలపల్లి రూరల్: పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని బావుసింగ్‌పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బావుసింగ్‌పల్లి గ్రామానికి చెందిన ల్యాదేళ్ల నరేష్(35) ఆర్థిక ఇబ్బందులుతో ఈనెల 7న పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం వరంగల్ తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చల్లరాజు తెలిపారు.
చికిత్స పొందుతున్న వృద్ధుడి..
రేగొండ: ఎద్దు దాడి చేసిన ఘటనలో వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకోడేపాకలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడేపాక గ్రామానికి చెందిన కనకం వెంకట రాజన్న (60) గురువారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన ఎద్దు దాడి చేసింది. ఈ దాడిలో రాజన్న తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
16న రాష్ట్ర సదస్సు
చిట్యాల: కళాకారులందరికీ గుర్తింపు కార్డులు, వృత్తి రక్షణ ఉపాధి కల్పన కోసం ఈనెల 16న హనుమకొండలో నిర్వహించే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని బ్యాండు వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పర్లపెల్లి రవి, కోశాధికారి లద్దునూరి ప్రభు, జాయింట్ సెక్రటరీ భద్రయ్య, అంకుషావళి, బోనగిరి రాజు, వైదనాల మొగిలి, సాయబ్ హూస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతున్న యువకుడి మృతి