
నల్ల నేలలో సమ్మె విజయవంతం
భూపాలపల్లి అర్బన్: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఒక్కరోజు టోకెన్ సమ్మె విజయవంతమైంది. సమ్మెలో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లలో సమ్మె కొనసాగింది. సమ్మె కారణంగా ఏరియాలోని రెండు ఓపెన్ కాస్ట్‌లు, నాలుగు భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సంస్థలకు రూ.76 కోట్ల నష్టం వాటినట్లు అధికారులు అంచనా వేశారు. సమ్మె నేపథ్యంలో జిల్లా కేంద్రంలో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆయా కార్మిక సంఘాల కార్యాలయాల నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కొరిమి రాజ్‌కుమార్, బే తెల్లి మధుకర్‌రెడ్డి, బడితల సమ్మయ్య, కంపేటి రాజయ్య మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మిక హక్కులను హరింపజేస్తుందని మండిపడ్డారు. ఈ నాలుగు కోడ్‌ల విధానంతో కార్మికుల భవిష్యత్ అంధకారంగా ఉండబోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం కోడ్‌ల విధానంతో మళ్లీ 12 గంటల పని విధానాన్ని బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తుందని తెలిపారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కట్టబెట్టే విధంగా ఈ నాలుగు నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని వివరించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని మానుకొని నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామచందర్, సుధాకర్‌రెడ్డి, జోగబుచ్చయ్య, బందు సాయిలు, నూకల చంద్రమౌళి, సోత్కు ప్రవీణ్‌కుమార్, సతీష్, రాజయ్య, సదానందం, మధు, రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమ్మె
విధులకు దూరంగా సింగరేణి కార్మికులు
గనుల వద్ద భారీ బందోబస్తు

నల్ల నేలలో సమ్మె విజయవంతం