
పుష్కర విధుల్లో అతివలు..
కాటారం/మల్హర్ : ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు.. ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా పోటీపడుతూ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానంలో నిలుస్తున్నారు. ఉద్యోగాలు పొందిన అనంతరం విధి నిర్వహణలో పురుషులతో సరిసమానంగా ముందుకెళ్తున్నారు. ఎంతకష్టమైనా ఉన్నతాధికారులు కేటాయించిన విధులు సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల్లో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీస్, వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల్లో పలు కేడర్లకు చెందిన మహిళా ఉద్యోగులు, సిబ్బంది పుష్కరాల్లో భక్తులకు సేవలందిస్తున్నారు.
సుమారు 300 మంది మహిళా ఉద్యోగులు..
సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా పోలీస్, వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమశాఖల పరిధిలో సుమారు 300 మంది మహిళా ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. ఇందులో పోలీస్‌శాఖలో సుమారు 80 మంది మహిళా ఎస్సైలు, కానిస్టేబుళ్లు, వైద్యారోగ్య శాఖలో 30 మంది మహిళా వైద్యులు, 120 మంది ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్తలు, మహిళా, శిశ ుసంక్షేమ శాఖకు సంబంధించి సుమారు 70 మంది మహిళా ఉద్యోగులు, సిబ్బంది భక్తులకు తమ శాఖల ద్వారా సేవలు అందిస్తున్నారు. ప్రధాన ఆలయం, త్రివేణి సంఘమం, సరస్వతి పుష్కరఘాట్ వద్ద విధులు నిర్వర్తిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పలువురు మహిళా ఉద్యోగులు ‘సాక్షి’ పలకరించగా తమ అనుభూతులను పంచుకున్నారు.
పురుషులకు దీటుగా మహిళా ఉద్యోగుల సేవలు
అధికంగా పోలీస్, వైద్యారోగ్య, శిశు సంక్షేమ శాఖలు
భక్తిభావంతో పన్నెండు రోజుల పాటు విధుల నిర్వహణ