
త్వరలో జిల్లాకు క్రికెట్ స్టేడియం
● ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
● అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు షురూ
వరంగల్ స్పోర్ట్స్: జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణ అంశాన్ని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు తీసుకెళ్లారని, త్వరలోనే స్టేడియం ఏర్పాటు ప్రకటన వెలువడనుందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్డిపురంలో సోమవారం అంతర్‌జిల్లాల క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో బీజంపడిన క్రికెట్ స్టేడియం నిర్మాణం.. ఇప్పుడు ఆచరణలోకి రానుందని, అందుకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు తానుకూడా ముందుండి నిర్మాణం జరిగేలా చొరవచూపుతానని భరోసా కల్పించారు. క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ రెడ్డిపురంతో పాటు మొగిలిచర్ల గ్రౌండ్‌లో జనగామ, ములుగు, వంగాలపల్లి మైదానంలో వరంగల్, మహబూబాబాద్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు కొనసాగాయని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు సదాశివ్, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్ పాల్గొన్నారు.